ఉద్యోగ నియామకాల విధానంలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురావడంతో అవినీతి, బంధుప్రీతికి ఎక్కడా అవకాశం లేకుండా అంతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రోజ్గార్ మేళా సందర్భంగా దేశ వ్యాప్తంగా 71,000 ఉద్యోగ నియామక పత్రాలను మంగళవారం ప్రధాని మోదీ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ నియామక అవకాశాలు, మౌలిక సదుపాయాలు విస్తృత పర్చడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం దగ్గర నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ప్రక్రియ అంతా ఆన్లైన్ అయిందని చెప్పారు.
దేశంలో ఉపాధి రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకమూ యువతకు ఉపాధి కల్పించేందుకు మార్గంగా నిలిచిందని తెలిపారు. దీనిలో భాగంగా గ్రామాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా కృషి చేశామని పేర్కొన్నారు
ఈరోజు ప్రాముఖ్యత గురించి వివరిస్తూ తొమ్మిదేళ్ల క్రితం మే 16న లోక్సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయని, అలాగే ఈరోజు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవమని గుర్తు చేశారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం స్ఫూర్తితో తమ ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు.
వాల్మార్ట్, యాపిల్, ఫాక్స్కాన్, సిస్కో వంటి ముఖ్యమైన గ్లోబల్ సంస్థల సీఈఒలతో ఇటీవల తాను నిర్వహించిన సమావేశాల్లో అపూర్వ సానుకూలత లభించిందని, మన దేశంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇపిఎఫ్ఒ (ఉద్యోగుల భవిష్య నిధి) గణాంకాల ప్రకారం 2018-19 నుంచి దేశంలో 4.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని స్పష్టమైందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రికార్డు స్థాయిలో ఎగుమతుల వల్ల దేశం నలుమూలలా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, అభివృద్ధి చెందుతున్న రంగాలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ఉద్యోగాల స్వభావమే మారుతోందని వివరించారు.
అంకుర పరిశ్రమల రంగంలో దేశం విప్లవాత్మక మార్పులను చూస్తోందని చెబుతూ 2014 కు ముందు కొన్ని వందల సంఖ్యలో అంకుర పరిశ్రమలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య లక్షకు చేరిందని తెలిపారు. వీటివల్ల కనీసం 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. కొత్త ఉద్యోగాల కనీస వసతుల కోసం మూలధన వ్యయం నుంచి రూ. 34 లక్షల కోట్లు ఖర్చు చేయడమైందని, మరో రూ. 10 లక్షల కోట్లు ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించడమైందని వివరించారు.