భూతాపం కారణంగా సముద్ర మట్టాలు పెరిగి ప్రపంచంలోని అనేక తీర ప్రాంత గ్రామాలు, పట్టణాలు భవిష్యత్‌లో ముంపునకు గురువుతాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మిగతా పట్టణాలతో పోలిస్తే, మూడురెట్ల వేగంగా న్యూయార్క్ సిటీ మునిగిపోతుందని తాజా పరిశోధనల్లో తేలింది.
ప్రపంచంలో ఏ నగరంలోనూ లేని విధంగా ఆకాశహర్య్మాలతో కాంక్రీట్ జంగిల్‌ను తలపించేలా న్యూయార్క్ సిటీ అభివృద్ధి చెందింది. అయితే అక్కడి నేల తట్టుకోలేనంత బరువుతో ఆ భవనాలు కట్టేశారు. ఫలితంగా నెమ్మదిగా కుంగటం మొదలైంది.
స్పష్టంగా చెప్పాలంటే మన ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్ కుంగిపోయి ఇళ్లు బీటలవారి, నేల నెఱ్రలువీరిన తీరులో న్యూయార్క్ శిథిలమవబోతోందన్నమాట. కాకపోతే జోషిమఠ్ పర్వత సానువుల్లో ఉంది. న్యూయార్క్ సిటీ సముద్రతీరంలో ఉంది.
అడ్వాన్సింగ్ ఎర్త్ అండ్ స్పేస్ సైన్స్ జర్నల్‌లో ఇటీవల న్యూయార్క్ సిటీ ముంపునకు సంబంధించిన పరిశోదనా పత్రం ప్రచురితమైంది. సముద్రమట్టాలు పెరగడం, నగరంలో కాంక్రీట్ నిర్మాణాల బరువును అక్కడి నేల తట్టుకోలేకపోవడం, తరచూ తుపానుల తాకిడి పెరగడం వంటి ప్రకృతి పరమైన మార్పులు న్యూయార్క్‌ను ముంచేయనున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రపంచంలోని తీర ప్రాంత గ్రామాలు, నగరాలు ముంపునకు గురయ్యే అంశంపై యూనివర్శిటీ ఆఫ్ రోడ్ ఐలండ్‌కు చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.