కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినా, ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్ అధికారులకు చెబుతున్నారు.
కాగా, ఎన్నికల్లో గెలిచి తమ ప్రభుత్వం ఏర్పడితే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నెల 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో కొప్పల్, కలబురగి, చిత్రదుర్గ వంటి జిల్లాల్లోని గ్రామాల ప్రజలు విద్యుత్ బిల్లుల చెల్లింపును నిలిపివేశారు.
ఉచిత విద్యుత్‌పై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సీఎం కానున్న సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం కానున్న డీకే శివకుమార్ తమ విద్యుత్ బిల్లులు చెల్లిస్తారని అధికారులకు చెబుతున్నారు.
వారు ఇచ్చిన హామీ వల్ల విద్యుత్ బిల్లులు చెల్లించబోమని స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం తమ ఇళ్ల వద్దకు రావద్దని విద్యుత్ సిబ్బందికి తెలిపారు. దీంతో ఏం చెయ్యాలో తెలియక విద్యుత్ సిబ్బంది, అధికారులు అయోమయంలో పడ్డారు.