ఢిల్లీలోని అమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నైపుణ్య పరిజ్ఞానం కలిగిన వ్యక్తులను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి)కి నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నరుకు ఉన్నదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అందుకు మంత్రిమండలి సాయం కానీ, సలహా కానీ అవసరం లేదని తేల్చిచెప్పింది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన బెంచ్ సోమవారం తీర్పు వెలువరించింది. 1957వ సంవత్సరపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 1993లో తొలిసారి చేసిన సవరణ ద్వారా ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులను నామినేట్ చేసే చట్టబద్ధమైన అధికారం లెఫ్టినెంట్ గవర్నరుకు సంక్రమించిందని న్యాయస్థానం తెలిపింది.
మంత్రిమండలిని సంప్రదించకుండా పది మందిని ఎంసిడికి నామినేట్ చేస్తూ గత ఏడాది జనవరి 1, 4 తేదీల్లో లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా జారీ చేసిన ఆదేశాలు, నోటిఫికేషన్లను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. నియామకాల విషయంలో మంత్రిమండలి సాయం, సలహా తీసుకునేలా లెఫ్టినెంట్ గవర్నరును ఆదేశించాలని కోరింది.
ఈ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించలేదు. 2022 డిసెంబరులో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. దీంతో పదిహేను సంవత్సరాల బిజెపి పాలనకు తెరపడింది. ఎన్నికల్లో ఓడిపోయినా దొడ్దిదారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తనకు అనుకూలురైన పది మంది సభ్యులను లెఫ్టినెంట్ గవర్నరుతో నామినేట్ చేయించింది.