కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ శాసనసభాపక్షం గత సాయంత్రం ఆయనను తమ నాయకుడినిగా ఎన్నుకోవడం, వెంటనే గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత తెలపడం, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం అన్ని చక చక జరిగిపోయాయి.
శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా జరిగే ఈ ప్రమాణస్వీకారోత్సవానికి పలు ప్రతిపక్ష పాలిత రాస్ట్రాల ముఖ్యమంత్రులను, భావసారూప్యత గల పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్సింగ్ సుక్కూ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్, హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి. రాజా, సీతారాం ఏచూరి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
పార్టీ ప్రయోజనాలకే తన ప్రథమ ప్రాధాన్యమని, అందుకే వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కాదనుకున్నానని శివకుమార్ చెప్పారు. సీఎం పదవిపై పట్టు సడలించడానికి పలు కారణాలు ఉన్నాయని చెప్పారు. సోనియా నచ్చజెప్పడం వల్లే వెనక్కి తగ్గారా అని అడుగగా.. ‘ఈ వ్యవహారంలోకి ఆమెను గానీ, గాంధీ కుటుంబాన్ని గానీ తీసుకురాదలచుకోలేదు. రాహుల్, ఖర్గేను, ఏఐసీసీ ఆఫీసు బేరర్లను మాత్రమే కలిశాను.. అంతే’ అని బదులిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన మరో సీనియర్ నాయకులు జి పరమేశ్వరన్ గురువారం కాస్త అసంతృప్త గళాన్ని వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పదవిని దళితులకు ఇవ్వకపోతే పార్టీలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని, ఇది రాబోయే కాలంలో పార్టీకి పెను సమస్యగా పరిణమిస్తుందని కేంద్ర నాయకత్వాన్ని ఆయన హెచ్చరించారు. డికె శివకుమార్ ఏకైక ఉపముఖ్యమంత్రిగా ఉంటారని అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
224 స్థానాలున్న కర్ణాటక శాసనసభకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. 35 స్థానాల్లో కాంగ్రెస్ జయభేరీ మోగించింది. మరో ఇద్దరు స్వంతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ గూటికి చేరడంతో దాని సంఖ్యాబలం 137కు చేరింది. బిజెపి 66 స్థానాలకే పరిమితమైంది. జెడిఎస్ 19 స్థానాల్లో విజయం సాధించింది.