కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్, ప్రియాంక సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం విశేషం.
కర్ణాటక మంత్రులుగా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జి. పరమేశ్వర(దళిత), కేహెచ్ మునియప్ప(దళిత), కేజే జార్జ్(క్రిష్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీష్ జార్కలి(ఎస్టీ), జమీర్ అహ్మద్(ముస్లిం మైనార్టీ), రామలింగా రెడ్డి(రెడ్డి), సతీష్ జార్కిహోలి(ఎస్టీ) ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉండటం గమనార్హం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సీఎంలు, పలు పార్టీల నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
తమిళ నటుడు కమల్‌హాసన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, ఛత్తీస్గర్ సీఎం భూపేశ్ భగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో ఉన్నారు. సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
2013లో సిద్ధరామయ్య మొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 136 అసెంబ్లీ స్థానాలు దక్కడంతో సిద్ధరామయ్యకు మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడి డీకేను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించి, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా నిర్ణయించింది.