‘‘కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నవా? ఆ ప్రాంతంలో గజం లక్షకుపైగా పలుకుతుంటే రూ.7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు?” అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
అదే ప్రాంతంలో సర్కారు భూమిని హెచ్ఎండీఏ అధికారులు గజానికి లక్ష పదివేలకు చొప్పున మార్కెట్ లో అమ్మకానికి పెడుతూ పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. మరి అదే ప్రాంతంలో రూ.550 కోట్ల విలువైన భూమిని రూ. 40 కోట్లలోపే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అంటూ ధ్వజమెత్తారు.
వాస్తవానికి ఓపెన్ మార్కెట్ లో కోకాపేటలో ఎకరం ధర వంద కోట్ల రూపాయలకుపైగా పలుకుతోందని, ఈ లెక్కన బీఆర్ఎస్ కు కట్టబెట్టిన భూముల విలువ రూ. 1100 కోట్లకు పైమాటేనని తెలిపారు. ఈ భూమిని ధారాదత్తం చేసుకునేందుకు ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకున్నారని తెలిపారు.
అయినప్పటికీ మీడియాకు మాత్రం ఈ వివరాలను వెల్లడించకుండా రహస్యంగా దాచి ప్రజల ఆస్తులను కొట్టేశారని సంజయ్ మండిపడ్డారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్ సొంత పార్టీకి కేటాయించుకునేందుకు భూములెక్కడినుండి వస్తున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం అత్యంత కారు చౌకగా భూమిని కొట్టేసిన కేసీఆర్ ఆ భూములు చాలవని ‘‘ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలెప్ మెంట్’’ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని కాజేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ జీవో పరిధిలోని పేదల వందల ఎకరాల భూములను కారు చౌకగా భూములను కొనుగోలు చేసిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు… ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేసుకుని గజాల చొప్పున అమ్ముకుంటూ లక్షల కోట్ల రియల్ దందాకు తెరదీశారని ధ్వజమెత్తారు. ఈ విషయాలను ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పెద్ద ఎత్తున ఉద్యమించి సర్కార్ భూ భాగోతాన్ని ప్రజల్లో ఎండగడతామని చెప్పారు.