ఉద్యోగాల భర్తీకి వెంటనే కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరుపదలచిన `నిరుద్యోగ దీక్ష’ కు కరోనా ఆంక్షల పేరుతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దానితో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో యధావిధిగా దీక్షను కొనసాగించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు.
బీజేపీ దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ దీక్ష కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
కాగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు జీవో జారీ చేసింది. ఈ మేరకు జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిషేధం. ఈ మేరకు బీజేపీ దీక్షకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.
ఇలా ఉండగా,ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన ‘నిరుద్యోగ దీక్ష’కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. కరోనా నిబంధనలకు లోబడి మా పార్టీ కార్యాయలంలో ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతుంటే ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏమిటి?. అని ప్రశ్నించారు.
‘నిరుద్యోగ దీక్ష’తో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ కళ్లకు కన్పడటం లేదా?.అని నిలదీశారు.
ఉద్యోగ, ఉపాధి కరువై లక్షలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు అల్లాడుతున్నా కళ్లుండి చూడలేని కబోధిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సంజయ్ మండిపడ్డారు. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యను ముక్త కంఠంతో ఖండించాలని ఆయనకోరారు . నిరుద్యోగ యువతీ, యువకుల పక్షాన బీజేపీ చేపడుతున్న ‘నిరుద్యోగ దీక్ష’కు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను ఆయన కోరారు.
ఇలా ఉండగా, బండి సంజయ్ సోమవారం తలపెట్టిన నిరుద్యోగ దీక్షను విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాయడంపై బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష నాయకుడు రాజాసింగ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన విమర్శలు ముమ్మాటికీ నిరుద్యోగులను అవమానించడమేనని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులను ఊరిస్తున్నారే తప్ప ఎలాంటి ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. కేటీఆర్ లేఖలోని విమర్శలకు తిప్పికొడుతూ రాజాసింగ్ మంత్రి కేటీఆర్ కు మరో బహిరంగ లేఖ వ్రాసారు.
లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారని, ఇప్పటి వరకు దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆ లేఖలో విమర్శించారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చేందుకు ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతుంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఎఫ్పుడిస్తారో చెప్పకుండా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.