సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శరత్‌బాబు.. ఈరోజు తుదిశ్వాస విడిచారు. నెలరోజులకు పైగా శరత్‌బాబుకు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
అయితే, సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. శరీరం మొత్తం విషపూరితం కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం సహా ఇతర అవయవాలు దెబ్బతిని శరత్‌బాబు మరణించారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శరత్‌బాబు భౌతికకాయాన్ని చెన్నై తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
1951 జులై 31న విజయశంకర దీక్షితులు, సుశీలాదేవి దంపతులకు శరత్‌బాబు జన్మించారు. శరత్‌బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. సత్యనారాయణ దీక్షితులు అని కూడా కొంత మంది చెబుతుంటారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. కాన్పూర్ నుంచి శరత్‌బాబు కుటుంబం ఆమదాలవలసకు వలస వచ్చింది.
ఆమదాలవలసలో రైల్వే క్యాంటీన్‌ను శరత్‌బాబు కుటుంబం నడిపేది. ఆ సమయంలో శరత్‌బాబు నాటకాల్లో నటించేవారు. కాలేజీ రోజుల్లో చాలా నాటకాల్లో శరత్‌బాబు నటించారు. శ్రీకాకుళం జిల్లాకే చెందిన ప్లే బ్యాక్ సింగర్ జి.ఆనంద్ శరత్‌బాబును మద్రాసు తీసుకువెళ్లారు. శరత్‌బాబు మద్రాసు వెళ్లిన కొన్నాళ్లకే ఆయనకు సినిమాల్లో అవకాశం వచ్చింది.
1973 లో ‘రామరాజ్యం’ చిత్రం ద్వారా శరత్‌బాబు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కె బాల చందర్ దర్శకత్వంలో 1978లో వచ్చిన తమిళ చిత్రం ‘నిళల్ నిజమగిరదు’తో శరత్ బాబు పాపులర్ అయ్యారు. ఇక తెలుగులో కె.బాలచందర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘ఇది కథకాదు’ సినిమాతో శరత్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కమల్ హాసన్, జయసుధ, చిరంజీవిలతో కలిసి ఈ సినిమాలో శరత్ బాబు నటించారు.
‘మరో చరిత్ర’, ‘మూడు ముళ్ల బంధం’, ‘తాయారమ్మ బంగారయ్య’, ‘సీతాకోక చిలుక’, ‘శరణం అయ్యప్ప’, ‘స్వాతిముత్యం’, ‘సంసారం ఒక చదరంగం’, ‘అభినందన’, ‘కోకిల’, ‘ఆపద్భాందవుడు’, ‘సాగర సంగమం’, ‘బొబ్బిలి సింహం’, ‘అన్నయ్య’ వంటి సినిమాలు శరత్ బాబును స్టార్ యాక్టర్‌ను చేశాయి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆయన 300కు పైగా సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.