క్రికెట్, రుచికరమైన వంటల అనుబంధం, దీనికి మించిన విశిష్టమైన పరస్పర నమ్మకం , ఆదరణీయ భావం భారత్ ఆస్ట్రేలియాల బంధానికి పెట్టని కోట అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మూడు దేశాల పర్యటనల్లో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన ప్రధాని మంగళవారం సిడ్నీ శివార్లలో జరిగిన సభలో మాట్లాడారు. లిటిల్ ఇండియాగా నామకరణం చేసిన ఈ వేదిక నుంచి ఆయన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనెస్‌తో కలిసి పాల్గొన్నారు.
భారతీయ సంతతివారిని ఉద్ధేశించి ఆయన ఈ భారీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇక్కడ వెలిసిన ఈ లిటిల్ ఇండియా ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తోందని చెప్పారు. ఇరుదేశాలకు క్రికెట్ అంటే ప్రాణప్రదం, ఇరుదేశాలకు చెందిన క్రికెటర్లు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని తెలిపిన ప్రధాని ఈ సందర్భంగా గవాస్కర్, గ్రేగ్ ఛాపెల్ పేర్లను ప్రస్తావించినప్పుడు భారతీయ సంతతివారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఇరు దేశాల సంబంధాలు స్థిరమైనవే కాకుండా క్రమేపీ స్థిరంగా పురోగమిస్తూ ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంబంధాలు రెండింతలు మూడింతలు అవుతాయని చెప్పారు. గత ఏడాది ఇరుదేశాల మధ్య కుదిరిన ఎకనామిక్ , ట్రేడ్ అగ్రిమెంట్ సత్ఫలితాలను ఇస్తోందని చెబుతూ ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి ఇరుదేశాల మధ్య సమగ్రమైన ఆర్థిక సహకార ఒప్పందం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
స్థిరమైన విశ్వసనీయ సరఫరా వ్యవస్థల ద్వారా ఉభయదేశాలు మరింత సన్నిహితం అవుతాయని తెలిపిన ప్రధాని ఇటువంటి ప్రక్రియ కేవలం ఇరుదేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి సరైన విశ్వాసం కల్పిస్తుందని స్పష్టం చేశారు. మూడు సి లు ఇరుదేశాల మధ్య సంబంధాలకు నిర్వచనంగా ఉండేవని క్రికెట్, కామన్వెల్తు, కర్రీ (త్రిబుల్ సి)లను ఆయన ప్రస్తావించారు.
ఇప్పుడు వీటికి తోడుగా 3 డిలను తాను ప్రస్తావిస్తున్నట్లు ఇవి డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీ అని వివరించారు. తరువాత ఇ కూడా ఉంటుంది. ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఎకనామి అని ఈ విధంగా పలు అంశాలను తెలియచేయవచ్చునని, అయితే రెండు దేశాల మధ్య స్నేహం పూర్తిగా వీటిన్నింటికీ మించిన వాస్తవిక ప్రగాఢ అనుబంధం మీదనే ఆధారపడి ఉందని ప్రధాని తెలిపారు.
ఆస్ట్రేలియాలో భారతీయ సంతతి వారి సేవలను ప్రధాని కొనియాడారు. ఇరు దేశాల మధ్య భూమిపరంగా చాలా దూరం ఉండవచ్చు. అయితే హిందూ మహాసముద్రం రెండు దేశాలను దగ్గర చేస్తుందని, సంస్కృతి సంప్రదాయాలు భిన్నం కావచ్చు అయితే అంతర్లీనంగా ఏకత్వం ఇన్నేళ్లుగా ఈ బంధం పటిష్టం అవుతోందని చెప్పారు.
యోగా ఇరుదేశాలను అనుసంధానం చేస్తుంది. ఏళ్ల తరబడిగా ఇరుదేశాల మధ్య క్రికెట్ ఓ వారధిగా ఉంది. క్రికెట్లో రెండు దేశాలు పోటాపోటీగా వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. అయితే ఆసక్తికరమైన ఈ పోటీ స్థాయిలోనే వెలుపల ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టం అవుతూ వచ్చాయని అంటూ టెన్నిస్, సినిమాలు ఇరు దేశాలను కలిపే బంధాలని ప్రధాని వివరించారు.
ఇరు దేశాల మధ్య వైమానిక సౌకర్యం పెరిగింది. ఇకపై మరిన్ని విమాన సర్వీసులు సాగుతాయని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉందని, ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్‌లు ఈ విషయాన్ని గణాంకాలతో తెలిపాయని పేర్కొంటూ భారత్‌లో పెట్టుబడులకు ఆహ్వానించారు.
గ్లోబల్ ఎకనామిలో భారతదేశం కీలక బిందువు అవుతుందని ఐఎంఎఫ్ చెప్పినట్లు గుర్తు చేశారు. ఇక్కడి హారిస్ పార్క్‌కు లిటిల్ ఇండియా పేరు పెట్టినందుకు ప్రధాని ఆంథోనీకి ధన్యవాదాలు చెప్పారు. ఈ ప్రాంతంలో భారతీయ జిలేబీలు, ఛాట్ బాగా ఉంటాయని తెలిసిందని, తన స్నేహితుడు ప్రధాని ఆంథోనీకి భారతీయ సంతతివారు వాటి రుచిచూపించాలని చమత్కరించారు.
ప్రియమైన స్నేహితుడు మోడీ అంటూ ప్రధాని మోదీని పిలిచిన ఆంథోనీ ప్రపంచపు అతి పెద్ద ప్రజాస్వామిక దేశపు స్ఫూర్తిని ఆయన ఇక్కడికి తీసుకువచ్చారని కొనియాడారు. భారతీయ సంతతి వారు ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని తమ దేశంగా చేసుకున్నందుకు సంతోషంగా ఉందని, వారంతా తన స్నేహితులని తెలిపారు.