ఒక వంక, కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు చట్టాన్ని రూపొందిస్తుండగా, స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) ప్రైవేట్ డిజిటల్ కరెన్సీని నిషేధించాలని డిమాండ్ చేసింది. అయితే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అన్వేషణకు మద్దతు ఇచ్చింది.
గ్వాలియర్‌లో మంచ్ రెండు రోజుల జాతీయ సమావేశాలలో ఆమోదించిన తీర్మానంలో, “అంతర్లీన ఆస్తి లేదు”, “జారీదారుని గుర్తించలేము”, “క్రిప్టోకరెన్సీ గుర్తింపు ఊహాజనిత వ్యాపారంకు దారితీయవచ్చు” వంటి కారణాలను పేర్కొంటూ వర్చువల్ కరెన్సీని నిషేధించాలని ఈ సంస్థ స్పష్టం చేసింది.
పైగా, మనీలాండరింగ్ కు, ఉగ్రవాద ఫైనాన్సింగ్‌కు దారితీయవచ్చని హెచ్చరించింది. క్రిప్టోకరెన్సీలను కలిగి ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని సమర్పించే నిబంధనకు లోబడి తక్కువ వ్యవధిలో విక్రయించడానికి లేదా మార్పిడి చేయడానికి అనుమతించవచ్చని తెలిపింది.
అలాగే ఆర్బిఐ ద్వారా డిజిటల్ కరెన్సీ జారీకి సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని, అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. క్రిప్టోకరెన్సీని అనుమతించడం వలన “వెనుక తలుపు నుండి మూలధన ఖాతా మార్పిడికి దారి తీస్తుంది” అని ఎస్ జె ఎం వారించింది. అయితే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని క్రిప్టోకరెన్సీలకు మాత్రమే లింక్ చేయరాదని, ఆర్థిక లేదా సామాజిక కార్యకలాపాల అన్ని రంగాలలో ఈ సాంకేతికతను ఉపయోగించడాన్ని తప్పనిసరిగా ప్రోత్సహించాలని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది ప్రజలు తమ డబ్బును క్రిప్టోకరెన్సీలలో ఉంచినట్లు అంచనా అంటూ, వీరిలో ఎక్కువ మంది యువత తమ డబ్బును అందులో ఉంచడం ద్వారా త్వరగా లాభం పొందవచ్చని భావిస్తున్నారని ఎస్ జె ఎం తెలిపింది.
“మొదట, క్రిప్టోకరెన్సీ అనేది కరెన్సీ అనే తప్పు భావన. కరెన్సీ అంటే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన, ప్రభుత్వం హామీ ఇచ్చిన పరికరం. క్రిప్టోకరెన్సీలు చట్టపరమైన గుర్తింపు లేని ప్రైవేట్‌గా జారీ చేసే వర్చువల్ నాణేలు. రెండవది, క్రిప్టోను నేరస్థులు, ఉగ్రవాదులు, స్మగ్లర్లు, హవాలాలో పాల్గొన్న వ్యక్తులు ఉపయోగిస్తున్నారు. మూడవదిగా …ఇది విలువైన వర్చువల్ ఆస్తి. దాని హోల్డర్‌కు మాత్రమే తెలుసు. బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడే అధికారులకు తెలుస్తుంది’’ అని ఎస్జేఎం ఈ కరెన్సీ పట్ల తన అభ్యంతరాలను వివరించింది.
“వాస్తవానికి, క్రిప్టో అనేది ఫియట్ ఆస్తి కాదు. దానిని కంపెనీ లేదా వ్యక్తి బ్యాలెన్స్ షీట్లో చూపరు. అంటే, ఆదాయపు పన్ను, జీఎస్టీ, అనేక రకాల పన్నుల ఎగవేతకు క్రిప్టో మాధ్యమంగా మారుతోంది. నిబంధనలను దాటవేస్తూ దేశం నుండి మూలధనాన్ని బదిలీ చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన పద్ధతి” అంటూ మంచ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఇది బెట్టింగ్‌ను ప్రోత్సహించే కరెన్సీ అస్థిరతను, అది డార్క్ వెబ్‌గా ఎలా పనిచేస్తుందో కూడా సూచించింది. ఎస్ జె ఎం ప్రకారం, అదే డబ్బును ఉత్పాదక ఆస్తులలో పెట్టుబడి పెట్టినట్లయితే, అది జిడిపి వృద్ధికి సహాయపడుతుంది. “క్రిప్టోకు వ్యతిరేకంగా ఉన్న ప్రధాన వాదనలలో ఒకటి, దాని మైనింగ్ భారీ మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తుంది. ఇది విద్యుత్ కొరతకు దారితీస్తుంది. క్రిప్టోను నిషేధించడంలో చైనా చేసిన అతిపెద్ద వాదనల్లో ఇదీ ఒకటి” అని గుర్తు చేసింది.