మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని లండన్‌లో వేలం వేశారు. ఈ ఖడ్గం వేలంలో ఏకంగా కోటీ 40 లక్షల 80 వేల 900 పౌండ్లు పలికింది. అంటే మన కరెన్సీలో రూ. 144 కోట్లకు పైనే ఉంటుంది. వేలం నిర్వహించిన బాన్‌హమ్స్ హౌజ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంచనా వేసిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోయినట్లు బాన్‌హమ్స్ తెలిపింది.
18వ శతాబ్ధంలో ఎన్నో యుద్ధాలను గెలిచిన టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. టైగర్ ఆఫ్ మైసూర్ గా సుప్రసిద్ధుడైన టిప్పు సుల్తాన్ తన సామ్రాజ్యాన్ని అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించి రక్షించుకున్నాడు. టిప్పు సుల్తాన్ మృతి తర్వాత అప్పటి బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బయిర్డ్ ఈ ఖడ్గం చేజిక్కించుకుని లండన్ తరలించాడు.
ఈ టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని మే 23న వేలం వేసినట్లు బోన్హమ్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఖడ్గాన్ని సొంతం చేసుకునేందుకు వేలంలో ముగ్గురు బిడ్డర్లు విపరీతంగా పోటీ పడినట్లు పేర్కొంది. చివరకు 14 మిలియన్ పౌండ్లకు ఈ టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని ఓ బిడ్డర్ దక్కించుకున్నట్లు బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ తెలిపింది.
అయితే ఈ ఖడ్గాన్ని ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ ఖడ్గాన్ని ఎక్కడి నుంచి కొన్నారని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్‌ను ప్రశ్నించగా.. సమాధానం ఇచ్చేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించారు.
ఈ టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని 2003లో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని చెల్లించకుండా పారిపోయిన భారత్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. లండన్‌లోని ఓ ఆక్షన్ హౌస్ నుంచి ఆయన కొన్నారని సమచారం. అయితే ఆ తర్వాత ఖడ్గాన్ని ఆయన విక్రయించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఈ ఖడ్గం కారణంగా తమ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడిందని 2015లో మాల్యా చెప్పినట్లు మీడియా కథనాలు వచ్చాయి. దీంతో ఆ ఖడ్గాన్ని వదిలించుకున్నానని మాల్యా చెప్పినట్లు పేర్కొన్నాయి. అయితే ఆ ఖడ్గాన్ని ఎవరికి విక్రయించారన్నది మాత్రం విజయ్ మాల్యా బయటపెట్టలేదు.