భారత్లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా ఢిల్లీలో 142 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్లో 49, రాజస్థాన్లో 43 చొప్పున ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 578 మందికి ఒమిక్రాన్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో 151 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారని చెప్పింది.
కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో 6,531 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. యాక్టివ్ కేసుల్లో 7,141 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 75,841 మంది కరోనా చికిత్స పొందుతున్నారని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.4 శాతంగా ఉందని తెలిపింది.
ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యయి. ఢిల్లీలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు.
కర్ణాటకలో కేసులు పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. హోటళ్లు, బార్లు, పబ్,రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్ కే అనుమతి ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. ‘
మహారాష్ట్రలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించారు. హర్యానాలో నైట్ కర్ఫ్యూ విధించారు. గుజరాత్ లోనూ కర్ఫ్యూ వేళలను పెంచారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. యూపీలోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
మరోవైపు దేశంలో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది.. ఇప్పటి వరకు 145 కోట్ల మందికి టీకా డోసులు పంపిణీ చేశారు. జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పిల్లలకు గోవాగ్జిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇది పిల్లల్లో ఇమ్యునిటీని పెంచుతుందని నిపుణులు తెలిపారు. వృద్ధులకు బూస్టర్ డోస్.. తొమ్మిది నెలల విరామ సమయంలో ఇవ్వాలని నిర్ణయించారు.