దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు (90) ఆదివారం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. టుటు మరణ వార్తను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసా తెలియజేశారు.
‘ఈ ఉదయం కేప్ టౌన్‌లోని ఒయాసిస్ ఫ్రైల్ కేర్ సెంటర్లో టుటు తుదిశ్వాస విడిచారు’ అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దక్షిణాఫ్రికా నల్ల జాతీయుల విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడిని కోల్పోయామని అధ్యక్షుడు రమఫొసా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
అయన అసమాన దేశభక్తుడు. జహానెస్బర్గ్కు మొదటి నల్లజాతి బిషప్, తరువాత కేప్ టౌన్ ఆర్చ్ బిషప్‌గా టుటు పలు బాధ్యతలు నిర్వహించారు. 1980 దశకంలో దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులపై శ్వేత దుర్హంకార ప్రభుత్వం సాగించిన క్రూరమైన అణచివేత, వర్ణవివక్షకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించారు.
నల్లజాతీయులపై సాగిస్తున్న దురాగతాలను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్‌కు టుటు అధ్యక్షత వహించారు. ఎల్జిబిటీల హక్కుల కోసం నికరంగా పోరాడారు. ఆయన కృషికి గుర్తింపుగా 1984లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. 1997లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణైంది. అప్పటి నుండి చికిత్స తీసుకుంటున్నారు.
మొదట జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్ శాంతి బహుమతి వరించింది.
బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది.