మణిపూర్‌లో తిరుగుబాటుదారులపై బీరేన్ సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం ఒక్కరోజే ఎనిమిది గంటల పాటు వేర్వేరు ప్రాంతాలలో ఎన్కౌంటర్లు జరిగినట్లు, దాదాపు 40 మంది వరకూ వేర్పాటువాదులను ఈ దశలో మట్టుపెట్టినట్లు తమకు సమాచారం అందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం విలేకరులకు తెలిపారు.
తిరుగుబాటుదారులను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. ‘‘సాధారణ పౌరులపై ఎం -16, ఎకె -47, స్నైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’’ అని ఎన్. బీరేన్ సింగ్ మీడియాకు తెలిపారు.
ఆందోళనకారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని మణిపూర్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మే 28న రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్ లోయలోని సేక్మయి, సుంగు, ఫయేంగ్, సెరయు ప్రాంతాల్లో తిరుగుబాటువాదులు కాల్పులకు పాల్పడ్డారని, దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలు, నిరసనలతో గత కొన్ని రోజులుగా అట్టుడుకుతోంది. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపూర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది.