2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఒక్క చోటకు చేర్చేందుకు కొంతకాలంగా జెడియు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్క కొలిక్కి వచ్చాయి. జూన్ 12న పాట్నాలో మొట్టమొదటి భేటీ జరిపేందుకు నిర్ణయించారు.
2024 ఎన్నికలలో అనుసరింపవలసిన ఉమ్మడి వ్యూహంపై జరిగే ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ తో సహా సుమారు 18 పార్టీల నేతలు పాల్గొనగలరని భావిస్తున్నారు. ఇప్పటికే బీహార్ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి నితీష్ కుమార్ వ్యక్తిగతంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహల్ గాంధీ, మమతాబెనర్జీ, శరద్ పవర్, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష పార్టీల ప్రముఖులను కలుసుకున్నారు.
నితీష్ కుమార్ ప్రతిపాదించిన ”వన్-ఆన్-వన్” వ్యూహానికి మమతా బెనర్జీ సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా ప్రకారం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీలు బీజేపీతో నేరుగా తలబడతాయి. బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖీ తలపడే 200కు పైగా సీట్లలో కాంగ్రెస్ను ప్రాంతీయ పార్టీలు బలపరుస్తాయి.
అయితే, ఈ భేటీకి బిఆర్ఎస్, వైసిపి, బిజెడి, బీఎస్పీ వంటి ఎన్డీయేలో భాగస్వామ్యం కానీ పక్షాలు దూరంగా ఉండే అవకాశం ఉంది. మరోవంక ఢిల్లీ ప్రభుత్వంకు అధికారుల వ్యవహారాలలో అధికారాలను నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వారం రోజులకే అటువంటి అధికారాలను లెఫ్టనెంట్ గవర్నర్ కు దాఖలు చేస్తూ కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్సు ఈ సందర్భంగా కీలక అంశం కానుంది.
ఈ ఆర్డినెన్సు పార్లమెంట్ ముందుకు వచ్చిన్నప్పుడు ప్రతిపక్షాలు ఉమ్మడిగా అడ్డుకొనే విధంగా చేసేందుకు మద్దతు కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహితం దేశ వ్యాప్తంగా పలు పార్టీల నేతలను కోరుతున్నారు. మొదటిసారిగా కాంగ్రెస్ నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేజ్రీవాల్ పాట్నా సమావేశంకు హాజరయ్యే విషయం సందేహాస్పదమే అని పరిశీలకులు భావిస్తున్నారు.
తాజాగా, పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా ప్రకటన చేసిన 20 రాజకీయ పక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. అదేవిధంగా ఈ ఆర్డినెన్సు విషయంలో సహితం ప్రతిపక్షాలు ఉమ్మడిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది.