తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబంలోని ప్రతి బిడ్డ చదువుకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘తల్లికి వందనం’ పేరుతో ఈ పథకం అమలు చేస్తామని, కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.
ఏపీలోని రాజమండ్రిలో ఆదివారం ముగిసిన రెండు రోజుల టీడీపీ మహానాడులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ గ్యాస్ మేనిఫెస్టో విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఆయన ప్రకటించారు.
18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ‘యువగళం’ పథకం కింద ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
‘అన్నదాత’ కార్యక్రమం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘‘ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తం. సంపద సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తం.” అని తెలిపారు.
ఈ నాలుగేళ్లలో టీడీపీ కార్యకర్తలను ఎన్నోరకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. రాజకీయ రౌడీలు… ఖబడ్దార్… జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీని దెబ్బతీద్దామని చూసి అనేకమంది విఫలమయ్యారని తెలిపారు. వైసీపీ హయాంలో ఉద్యోగులకు జీతాలు రావడం లేదని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలది అహంకారంతో కూడిన పాలన చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారని చంద్రబాబు మండిపడ్డారు.
వైసీపీ నేతలు దోచుకున్న డబ్బును జప్తు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ అసమర్థతతో రాష్ట్రం అప్పులపాలైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.