ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. వరుణుడి ఆటంకం మధ్య డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన పోరులో చెన్నై 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది.
తద్వారా ఐపీఎల్లో ఐదో టైటిల్ నెగ్గి ముంబై ఇండియన్స్‌ను సమం చేసింది. వర్షం కారణంగా ఆదివారం జరుగాల్సిన మ్యాచ్ సోమవారానికి వాయిదా పడగా రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్‌ను వరుణుడు వదల్లేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్ధిమాన్ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) వికెట్ల వెనుక ధోనీ చేసిన మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్ బాట పట్టాడు.
ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్సర్లు) కొన్ని విలువైన పరుగులు చేశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై తొలి ఓవర్ ఆడుతున్న సమయంలో వర్షం ముంచెత్తింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగింది. అరగంట అనంతరం వరుణుడు తెరిపినిచ్చినా, ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టింది.
అర్ధర్రాతి 12.10 గంటల సమయంలో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171గా నిర్ణయించారు. దీంతో ఆరంభం నుంచే దంచికొట్టిన చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.
కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దూబే (21 బంతుల్లో 32 నాటౌట్; 2 సిక్సర్లు), గైక్వాడ్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రహానే (13 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; ఒక ఫోర్, 2 సిక్సర్లు), జడేజా (6 బంతుల్లో 15 నాటౌట్, ఒక ఫోర్, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్‌కు శుభారంభం దక్కింది. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలతో అరవీర భయంకర ఫామ్‌లో ఉన్న గిల్ కోసం.. ప్రత్యర్థులు వ్యూహాలు సిద్ధం చేసుకోగా.. సీనియర్ వికెట్ కీపర్ సాహా చాపకింద నీరులా పరుగులు రాబట్టాడు. దీపక్ వేసిన మూడో ఓవర్లో 6,4,4 కొట్టిన సాహా ఇన్నింగ్స్‌కు ఊపుతెస్తే, దేశ్‌పాండేకు గిల్ హ్యాట్రిక్ ఫోర్లు రుచి చూపించాడు.
తీక్షణ ఓవర్లోనూ గిల్ హ్యాట్రిక్ ఫోర్లు దంచడంతో పవర్‌ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి టైటాన్స్ 62/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో స్పిన్నర్లను రంగలోకి దింపిన ధోనీ ఫలితం రాబట్టాడు. జడేజా బౌలింగ్‌లో క్రీజుకు కాస్త ముందు నిల్చొన్న గిల్.. ధోనీ చేసిన రాకెట్ స్టంపింగ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు