భారత్, నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయ శిఖరాలంత ఎత్తుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని, సరిహద్దు అంశాలను ఇదే స్ఫూర్తితో పరిష్కరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం భారత్ కు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు.
తర్వాత ఇద్దరు నేతలు కలిసి మీడియాకు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు వర్చువల్‌గా వివిధ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని “సూపర్ హిట్” చేయడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.
సరిహద్దు పెట్రోలియం పైప్‌లైన్ విస్తరణ, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల అభివృద్ధి, జలవిద్యుత్‌లో సహకారం తదితర ఏడు అగ్రిమెంట్లపై సంతకాలు చేశారు. వీటిలో ఇండియా–నేపాల్ ట్రాన్స్పోర్ట్ సవరణ ఒప్పందం కూడా ఉంది. ఇండియాలోని రుపైదిహా, నేపాల్‌లోని నేపాల్గంజ్లో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను, బీహార్‌లోని బత్నాహా నుంచి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు కార్గో రైలును ఇద్దరు ప్రధాన మంత్రులు ప్రారంభించారు.
ప్రచండ మాట్లాడుతూ.. ‘పొరుగు వారికి ఫస్ట్ ప్రయారిటీ’ అనే మోదీ విధానాన్ని అభినందించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతో పురాతనమైనవని, అవి ఇప్పటికీ బలంగా ఉన్నాయని తెలిపారు.