బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. బీజేపీ నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం దీక్ష చేస్తోన్న బండి సంజయ్‌కు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అరెస్టులు చేసినా పెద్ద ఎత్తున కార్యకర్తలు దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారని తెలిపారు.
తెలంగాణలో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పారని… ఉద్యోగాలు వచ్చాయా? అని నిలదీశారు. కేసీఆర్ ఇంట్లో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని చెబుతూ అందుకే ఉద్యమ వీరులు ఒకొక్కరు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ఏడేళ్ల మోదీ పాలన.. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు.
కాగా, రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా బిజెపి ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి భరోసా ఇచ్చారు. ఉద్యోగాలు ఇస్తామని యువతను టీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె సూచించారు. తెలంగాణ కోసం చేసిన పోరాటం.. మళ్లీ ఇప్పుడు చేద్దామని పిలుపు ఇచ్చారు.
ఈ ప్రభుత్వాన్ని కూలదూసే సత్తా యువతకు ఉందని ఆమె స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను పక్కకు పెట్టారని అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అనేక సమస్యలపై బీజేపీ పోరాడుతుందని విజయశాంతి స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్ ఏడేళ్ల పాటు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాగా బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు విద్యావాలంటీర్లు సంఘీభావం ప్రకటించారు. రెండేళ్ల నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం వేతనం కూడా ఇవ్వడం లేదని, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని విద్యావాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరుద్యోగ దీక్ష చేపట్టారు. సోమవారం ఉదయం బండి సంజ్, తరుణ్ చుగ్ ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళి అర్పించి దీక్షలో కూర్చున్నారు.
అలాగే విజయశాంతి, స్వామీగౌడ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఈటెల రాజేందర్, వివిధ మోర్చాల అధ్యక్షులు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. నిరుద్యోగ దీక్ష నేపథ్యంలో నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. కానీ కౌన్సిల్ ఎన్నికలు, హుజురాబాద్,హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు 50 వేల ఉద్యోగాలిస్తామని చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో నిరుద్యోగ యువత తీవ్ర అసహనంతో ఉందని బీజేపీ నేత తీన్మార్ మల్లన్న చెప్పారు. ఇవాళ నిరుద్యోగ దీక్షకు వస్తున్న వేలాది మంది తరలివస్తుంటే వారిని అరెస్ట్ చేశారని అంటూ ఈ విధంగా దీక్షలను అడ్డుకుంటూ..ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప..కేసీఆర్ సమాజానికి చేసిందేమి లేదని విమర్శించారు.
కాగా, దీక్షలో భాగస్వామ్యం కాకుండా చేసేందుకు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక నిరుద్యోగ దీక్షకు వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. జగిత్యాలలో బీజేపీ నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. 15 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.