వైఎస్సార్ యంత్ర సేవా-పథకం మెగా మేళా-2 ను ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు.
వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటుచేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సిఎం బటన్ నొక్కి నేరుగా జమచేశారు.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తున్నారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సిఎం పంపిణీ చేశారు. రూ. 361 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సిఎం జగన్ పంపిణీ చేశారు.
సిఎం జగన్ మాట్లాడుతూ రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తామని తెలిపారు. రైతన్నకు అండగా వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభించామని, ప్రతి ఆర్బీకే సెంటర్లో యంత్రాలకు రూ.15 లక్షలు కేటాయించామని తెలిపారు. రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయం పరికరాలు అందజేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు ఇస్తున్నామని చెప్పారు.
ప్రతీ ఆర్బీకే సెంటర్లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి సీహెచ్సీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సిఎం జగన్ చెప్పారు. అక్టోబర్లో 7 లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తామని ప్రకటించారు. వైఎస్సార్ యంత్ర సేవ యాప్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ప్రకటించారు.