రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరన్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న భారత మహిళా రెజ్లర్లకు 1983లో క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ జట్టు ఒక ప్రకటన విడుదల చేసింది.
‘ఢిల్లీలో భారతదేశపు ఛాంపియన్లు అయిన మహిళా రెజ్లర్లను మ్యాన్ హ్యాండిల్ చేసిన తీరును చూసి మేం చాలా వేదనకు, వ్యాకులతకు గురయ్యాం. ఎంతో కష్టపడి సాధించిన పతకాలను వారు గంగానదిలో పడేయాలనే ఆలోచనకు రావడం ఎంతో బాధపెట్టింది. ఎందుకంటే ఆ పతకాల్లో ఏళ్ల తరబడి చేసిన శ్రమ, త్యాగాలు, సంకల్పం దాగి ఉంటుంది. అంతేగాక వారు గెలిచిన పతకాలు వారికే కాదు, దేశానికే గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తాము రెజ్లర్లను కోరుతున్నాం. వారి సమస్య సాధ్యమైనంత త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం.’ అని తమ ప్రకటనలో 1983 క్రికెట్ వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ పేర్కొన్నది.
రెజ్లర్లు తమ పతకాలను విసిరిపడేయాలనే నిర్ణయం తీసుకోవడం గుండెలను పిండేసిందని, అయితే వారి నిర్ణయాన్ని తాము సమర్థించడంలేదని, ఎందుకంటే పతకాలు సాధించడం అంత సులువు కాదని, వాటి వెనుక ఎంతో కష్టం దాగి ఉందని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుల్లో ఒకరైన మదన్‌లాల్ పేర్కొన్నారు. వారి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పారు.
రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో బ్రిజ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే కూడా స్పష్టం చేశారు. ఎవరైనా మహిళ ఏదైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆ తర్వాత ఫిర్యాదు సరైందా కాదా అన్న కోణంలో విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు.
ఒక పార్లమెంట్ సభ్యురాలిగా కాకుండా, ఓ మహిళగా ఈ అభ్యర్థన చేస్తున్నానని, ఎవరైనా మహిళా అలాంటి ఫిర్యాదు చేస్తే, అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఆ తర్వాత ఆ ఫిర్యాదుపై సత్యాన్వేషణ చేపట్టాలని ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో తాను భాగస్వామ్యురాలునే అయినప్పటిక రెజ్లర్లతో ప్రభుత్వం సరైన రీతిలో సంప్రదింపులు జరపలేదని అంగీకరించాల్సి వస్తుందని ముండే తెలిపారు. భారీ ఎత్తున నిరసన జరుగుతున్నప్పుడు, దానిపై ఏ ప్రభుత్వమైనా దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇలా ఉండగా, మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలపై ఢిల్లీ కన్నాట్ పోలీసు స్టేషన్లో నమోదు అయిన ఎఫ్ఐఆర్ వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. మహిళా అథ్లెట్లను అసంబద్ధ రీతిలో తాకినట్లు బ్రిజ్‌పై ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అథ్లెట్ల శ్వాసను చెక్ చేయాలన్న ఉద్దేశంతో.. ఆయన ఆ అథ్లెట్లను అనుచిత రీతిలో తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అథ్లెట్లను పరీక్షిస్తున్న సమయంలో సంబంధం లేని ప్రశ్నలు వేసినట్లు పేర్కొన్నారు. ఏదైనా టోర్నీ సమయంలో గాయపడితే, వారి ట్రీట్మెంట్ ఖర్చు భరించేందుకు తమ లైంగిక వాంఛలు తీర్చాలని కోరినట్లు కూడా బ్రిజ్‌పై ఆరోపణలు ఉన్నాయి. డైటీషియన్ కానీ కోచ్ కానీ ఆమోదం ఇవ్వనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.
ఓ మైనర్ అథ్లెట్ వక్షోజాలను తన చేతులతో తడిమినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అథ్లెట్‌ను వెంబడించినట్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సాక్షీ మాలిక్, వినేశ్ పోగట్తో పాటు ఇతర ఏడుమంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
