ఒడిశాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మంది గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉందని పేర్కొన్నాయి.
రాత్రివేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవలి దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని భావిస్తున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది
తొలుత బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న యశ్వంతపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. దీంతో పలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయి. ఈ సమయంలో వచ్చిన షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొట్టింది.
దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై వస్తోన్న గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది.
ప్రమాదం తర్వాత బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. విషాదం గురించి తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు.. తక్షణమే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్బంజ్, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అలర్ట్ చేశారు. బోల్తాపడ్డ బోగీల నుంచి ఇప్పటివరకు 120 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదానికి సంఘీభావంగా ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా పాటించాలని నిర్ణయించింది. శనివారం జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దుచేసింది.