ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ ఆ నివేదికలో వెల్లడించింది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని వివరించింది.
పొరపాటుగా సిగ్నల్ ఇవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందని ప్రాథమిక రిపోర్ట్ తేల్చింది. ఈ మానవతప్పిదం కారణంగానే గూడ్స్ ట్రైన్ నిలిచివున్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించిందని, 3 రైళ్లు ఢీకొట్టుకోవడానికి ఇదే కారణమని సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం తేల్చిందని ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. మరోవైపు ప్రమాదం జరిగిన లైన్ పాక్షికంగా తుప్పుపట్టి ఉందని నిర్ధారణ అయ్యింది.
హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కి పొరపాటున సిగ్నల్ రావడంతో శుక్రవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో బాలాసోర్‌లోని బహనగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో లూప్ లైన్లోకి ప్రవేశించింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో లూప్ లైన్లోకి ప్రవేశించింది.
పొరపాటును గమనించి ఆ వెనువెంటనే సిగ్నల్‌ను ఉపసంహరించుకున్నప్పటికీ అప్పటికే ట్రైన్ లూప్ లైన్లోకి ప్రవేశించింది. ఫలితంగా అదే లైన్లో ఆగివున్న గూడ్స్ రైలుని కోరమండల్ వేగంగా ఢీకొట్టింది. ఈ తీవ్రత ధాటికి కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 21 కోచ్‌లు, బెంగళూరు-సూపర్‌ఫాస్ట్‌కు చెందిన 2 కోచ్‌లు రైళ్ల నుంచి విడిపోయి పక్క లైన్లో పడ్డాయి. సరిగ్గా ఇదేసమయంలో ఈ లైన్లో వెళ్తున్న బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉన్న కోచ్‌లను బలంగా ఢీకొట్టింది.
కాగా… రైల్వే సేఫ్టీ కమిషనర్ ఏర్పాటు చేసిన సాంకేతిక దర్యాప్తు (టెక్నికల్ ఎంక్వైరీ) సమగ్ర రిపోర్ట్ వచ్చాకే అసలు కారణాలు తెలియనున్నాయని నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు రైల్వేమంత్రిత్వశాఖ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక రెండు రైళ్లలోనూ స్లీపర్ కోచ్‌ల కంటే ఏసీ కోచ్‌లపై ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని రిపోర్ట్ తేల్చింది
మెయిన్ లైన్ పై వెళ్లేందుకే కోరమాండల్ కు సిగ్నల్ ఇచ్చారని, కానీ, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పొరపాటున లూప్ లైన్ లోకి వెళ్లిందని పేర్కొంది. లూప్ లైన్ లో ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఢీకొట్టగా, బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు వచ్చిందని, దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని వివరించింది.
కోరమాండల్ ట్రైన్ లో రైళ్లు ఢీ కొనడాన్ని నిరోధించే సాంకేతికతను అమర్చలేదని, ఒకవేళ ఆ సాంకేతికత ఇందులో ఉండి ఉంటే, ఈ ప్రమాదం జరిగేది కాదని, ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని మాజీ రైల్వే మంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన ఆమె రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ ముందే మీడియాతో మాట్లాడుతూ 21వ శతాబ్దంలోనే ఇది అతి పెద్ద రైల్వే ప్రమాదమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపే బాధ్యతను రైల్వే సేఫ్టీ కమిషన్ కు అప్పగించాలని ఆమె సూచించారు.