ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ… రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న మోదీ ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాధితులను స్వయంగా కలుసుకున్నానని, వారికి అన్నివిధాల వైద్యసాయం అందించి ఆదుకుంటామని చెప్పారు. ఇది చాలా తీవ్రమైన ఘటన అని, ఏ ఒక్క కోణం వదలి పెట్టకుండా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. ఈ ఘటనకు కారణకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ట్రాక్ పునరుద్ధరణ పనులను రైల్వే శాఖ యుద్ధపాత్రిపదికన పునరుద్ధరిస్తోందని తెలిపారు.
సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని ప్రధాని చెప్పుకొచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన అదేశించారు. వారికి అందుతున్న వైద్యసహాయాన్ని మంత్రులు, అధికారులతో కలిసి స్యయంగా సమీక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
దీనికి ముందు, బాలాసోర్ జిల్లాలో రైలు ప్రమాద దుర్ఘటనా స్థలిని ప్రధాని సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర మంత్రులు, రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు.
అక్కడకు చేరుకొనే ముందు రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఢిల్లీ నుంచే పర్యవేక్షించారు. హోమ్ మంత్రి అమిత్ షా తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.