ఒడిశా రైలు ప్రమాదం ఘటనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు. రైల్వే బోర్డు మొత్తం కేసును పూర్తి స్థాయి దర్యాప్తు కోసం సీబీఐకి సిఫారసు చేస్తోందని చెప్పారు.
అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఎలాంటి పరిపాలనాపరమైన సమాచారం వచ్చినా దర్యాప్తును సీబీఐతో జరపాలని బోర్డు నిర్ణయించిందని వివరించారు. అయితే, ప్రమాదానికి మూల కారణాన్ని, దానికి బాధ్యుతులైన ‘నేరస్తులను’ గుర్తించామన్న ఆయన కొద్ది గంటల్లోపే సీబీఐకి సిఫారసు చేస్తున్నట్లు తెలుపుడం గమనార్హం.
సంఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు పూరయ్యాయని మంత్రి తెలిపారు. సంఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, ఓవర్‌హెడ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇక దుర్ఘటన అనంతరం బాలాసోర్‌లోని రెండు రైల్వే లైన్లు ఆదివారం రాత్రి 8 గంటలకు పునరుద్ధరించనున్నట్టు రైల్వే బోర్డు తెలిపిందని మంత్రి వెల్లడించారు. మూడు రైలు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని వరుస ట్వీట్లలో మంత్రి పేర్కొన్నారు.
బాలాసోర్‌లోని ప్రమాద స్ధలం వద్ద ఓవర్‌హెడ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. బాధితులకు ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుందని వివరించారు.
మృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.50 వేలు చొప్పున అందజేయనుంది. అయితే, టిక్కెట్ లేని ప్రయాణికులకు సైతం పరిహారం లభించనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఆధారంగా టిక్కెట్ లేని బాధితులకు పరిహారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ ఆదివారం ప్రకటించింది.
‘‘ప్రయాణికులకు టికెట్ ఉందా? లేదా? అనే దాంతో సంబంధం లేకుండా ప్రమాదానికి గురైన వారందరికీ పరిహారం అందుతుంది’’ అని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ స్పష్టం చేశారు. మరోవైపు, రైల్వే బోర్డు ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగం సభ్యురాలు జయ వర్మ సిన్హా మాట్లాడుతూ.. మృతులు, గాయపడిన వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు.. హెల్ప్‌లైన్ నంబరు 139కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
‘‘మృత దేహాలను తీసుకువెళ్లడానికి, గాయపడిన వారిని కలవడానికి కుటుంబసభ్యులు వస్తామంటే మాకు ఫోన్ చేయొచ్చు.. వారి ప్రయాణానికి, ఇతరత్రా అయ్యే ఖర్చులన్నీ మేం భరిస్తాం’’ అని ఆమె చెప్పారు.