గంగానదిపై నిర్మాణంలో ఓ వంతెన పేక మేడలా కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బిహార్‌లోని భాగల్పుర్ జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్‌గంజ్ వంతెన ఆదివారం కుప్పకూలింది. అయితే, డిజైనులో లోపాలు ఉన్నందున నిపుణుల సూచన మేరకు కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
భాగల్పుర్, ఖగారియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్‌లో తుఫాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయి. ఈ నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. 2015లో ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ శంకుస్థాపన చేయగా.. ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తికావాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ పనులు అసంపూర్తిగానే జరిగాయి. వంతెన కూలుతున్న సమయంలో స్థానికులు ఆ దృశ్యాలను వీడియోల్లో రికార్డు చేశారు.
అప్పుడెప్పుడో 2014లో ప్రారంభమైన దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనార్హం. ఆ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలయడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై భాగల్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రాత్ కుమార్ సేన్ మాట్లాడుతూ.. ‘నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెనలోని 4 నుంచి 5 పిల్లర్లు కూలిపోయినట్టు నాకు సమాచారం వచ్చింది.. సంబంధిత విభాగం అధికారులతో మాట్లాడుతున్నాం’ అని వివరించారు.
అయితే, ఈ ఘటన నితీశ్ కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌధురి ఆరోపించారు. గతేడాది డిసెంబరులో బెగుసరాయ్ జిల్లాలో బుర్హి గండకీ నదిపై వంతెన ఇలాగే కొట్టుకుపోయింది. అధికారికంగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రారంభానికి ముందే వంతెన కూలిపోవడంతో దుమారం రేగింది.
కాగా, ఈ వంతెనను బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెబుతున్నారు. ప్రమాదంపై పర్బానీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ మాట్లాడుతూ.. నితీశ్ కలల ప్రాజెక్టుగా అగువానీ-సుల్తాంగంజ్ వంతెన నిర్మితమవుతోందని తెలిపారు.
‘ఈ ఏడాది నవంబర్- డిసెంబర్ నాటికి వంతెన నిర్మాణం పూర్తవుంతుదని భావించాం. ఆ తర్వాత ప్రారంభించాలని అనుకున్నాం. ఇంతలో వంతెన కూలిపోవడం బాధాకరం’ అని సుల్తాంగంజ్ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ అన్నారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం నితీశ్ తీవ్రంగా స్పందించారు. పూర్తి విచారణ జరిపి, బాధ్యులను త్వరగా గుర్తించాలని అధికారులకు నీతీశ్ కుమార్ ఆదేశించారు.