కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత సాదాసీదాగా బెంగళూరులోని తమ నివాసంలోనే జరిపారు. ఈ వివాహానికి అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవర్నీ ఆహ్వానించలేదని తెలుస్తోంది.
ప్రధాన మంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా పనిచేస్తున్న, గుజరాత్‌కు చెందిన వరుడు ప్రతీక్‌తో వాంగ్మయి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయంలో జరిపింంచారు. ఉడిపిలోని అదమరు మఠ్‌కు చెందిన పీఠాధిపతులు ఈ వివాహ క్రతువు నిర్వహించారు. వరుడు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా పేరుంది.
అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేవారు. 2014 నుండి ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. చాలా లోప్రొఫైల్ లో ఉండే ఆయన ఇతర ఉన్నతాధికారులు, ప్రధాని కార్యక్రమాల తీరు గురించి ఎప్పుడు ఓ కన్నేసి ఉంటారని పేరుంది. ఎక్కడ ఏమి జరుగుతుందో ప్రధానికి కీలక సమాచారం అందిస్తుంటారని చెబుతుంటారు.
ఇక, ఈ వివాహం గురించి సీతారామన్ కుటుంబసభ్యులు అధికారికంగా బయటకి వెల్లడించకున్నా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల గారాలపట్టి వాంగ్మాయి ప్రస్తుతం మింట్ లాంజ్ ఫీచర్స్ విభాగంలోని బుక్స్ అండ్ కల్చర్ సెక్షన్లో ఉద్యోగిగా ఉన్నారు. దీనికి ముందు ది హిందూలో ఫీచర్స్ రాసేవారు. నార్త్‌వెస్ట్రన్ మెడిల్లి స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.
ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి తన కుమార్తె వివాహాన్ని నిరాడంబరంగా జరిపించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె తలుచుకుంటే ఎంతో ఆడంబరంగా పెళ్లి జరిపించేవారని, కానీ అందుకు భిన్నంగా ఆమె వ్యవహరించారని అంటున్నారు.