ఒడిశా రైలు ప్రమాద ఘటన బాలాసోర్ ప్రజలను వెంటాడుతోంది. ప్రమాద దృశ్యాలు, మృతదేహాలు ఇంకా వారి కళ్ల ముందే కదలాడుతున్నాయి. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 288 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. మృతదేహాలను భద్రపరిచేందుకు అక్కడికి సమీపంలోని బహానగా ప్రభుత్వ పాఠశాల గదిని తాత్కాలిక శవాగారంగా మార్చారు. రెండు రోజుల తర్వాత భువనేశ్వర్ ఆస్పత్రికి తరలించారు.
అయితే, త్వరలో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న తరుణంలో ఆ స్కూల్కు తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కూడా పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మృతదేహాలను వరుసగా భద్రపరిచిన దృశ్యాలే తమ కళ్ల ముందు కదలాడుతున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల భవనాన్ని కూల్చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఐతే ఇది జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే మృతదేహాలు ఉంచిన పాఠశాలకు రావడానికి విద్యార్ధులు బయపడుతున్నట్లు వారి తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చనిపోయిన వారి మృతదేహాలను ఉంచిన హైస్కూలును కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండే తెలిపారు.
ఐతే స్కూలు మేనేజింగ్ కమిటీ ఆమోదిస్తే.. శవాలను ఉంచిన గదులను కూల్చివేసి కొత్తవి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పాఠశాల కమిటీ వెంటనే సమావేశమై కూల్చివేతకు ఆమోదం తెల్పడంతో శుక్రవారం కూల్చివేత పనులు ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. కొత్త భవనాలు నిర్మించిన తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించి స్కూల్ పునఃప్రారంభిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఒరిస్సా రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులు జూన్ 19వ తేదీతో ముగియనున్నాయి.
రైలు ప్రమాదం తర్వాత పాఠశాలకు చెందిన కొంత మంది సీనియర్ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు రెస్క్యూ ఆపరేషన్లోనూ పాల్గొన్నారని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్ తెలిపారు. మృతదేహాలను తరలించిన తర్వాత పాఠశాలను శుభ్రం చేశారు. అయితే, చిన్న విద్యార్థులు మాత్రం స్కూల్కు వచ్చేందుకు భయపడుతున్నారని ప్రమీలా స్వేన్ చెప్పారు.
‘పాఠశాలలో కొన్ని శాంతి పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని భావించాం. అలాగైనా.. విద్యార్థులు, తల్లిదండ్రుల భయాలు కొంతమేర తొలగిపోతాయని అనుకున్నాం. కానీ, తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటే అవి కూడా పెద్దగా ఫలితం ఇవ్వవేమో అనిపించింది. అంతేకాకుండా, ఈ పాఠశాల భవనం కూడా 65 ఏళ్ల కిందట నిర్మించింది. భవనం బాగా దెబ్బతింది. అందువల్ల పాఠశాల భవనాన్ని కూల్చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశాం’ అని ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు.