మరి కొద్దీ రోజులలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అధికారమలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లోఅతిపెద్ద పార్టీగా నిలిచి రికార్డు సృష్టించింది. గత ఎన్నికలలో అఖండ విజయం సాధించిన బిజెపిని ఓడించి, కాంగ్రెస్, బిజెపి లకు పోటీగా ఓట్లు పొందింది.
మొత్తం 35 సీట్లలో 14 సీట్లు గెల్చుకొని, పూర్తి మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలబడింది. గత ఎన్నికలలో 25 సీట్లు ఉండగా 20 సీట్లు గెల్చుకున్న బిజెపి 12 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ ఒక సీటుకు పరిమితమైంది.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడం గమనార్హం. ఈ ఫలితాలు వస్తున్న సమయంలోనే పంజాబ్ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేయాలని బిజెపి, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోని లోక్ పంజాబ్ కాంగ్రెస్, సుఖ్దేవ్ సింగ్ దిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) పార్టీలు కలసి పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. ఉమ్మడిగా ఎన్నికల ప్రణాలికను ప్రకటించాలని కూడా నిర్ణయించాయి.
బీజేపీ సిట్టింగ్ మేయర్ రవికాంత్ శర్మవాస్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన అనూహ్య ఫలితాలపై ‘ఆప్’ సంబరాలు చేసుకుంటోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇది ‘ట్రయిలర్’ అని ఆ పార్టీ అభివర్ణించింది.
ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విజయాన్ని ‘మార్పునకు సంకేతం’గా ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ”చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం పంజాబ్లో చోటుచేసుకోనున్న మార్పులకు సంకేతం. అవినీతి రాజకీయ నాయకులను చండీగఢ్ ప్రజలు తోసిపుచ్చి, ఆప్ నిజాయితీ రాజకీయాలకు పట్టంకట్టారు. విజేతలకు, ఆప్ కార్యకర్తలకు అభినందనలు” అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే, సీట్లలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతంలో ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 29.87 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా 29.25 శాతం ఓట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక సీట్లలో మొదటి స్థానంలో ఉన్న ఆప్ 27.13 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. సీట్లలో, ఓట్లలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.