కేంద్ర ప్రభుత్వానికి రెజ్లర్లు అల్టిమేటం జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పోటీల్లో పాల్గొనేదే లేదని తేల్చి చెప్పారు.
సమస్యల పరిష్కారానికిజూన్ 15 వరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమయం ఇచ్చారని, తర్వాత ఏం చేయాలన్న దానిపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. తాము రోజు రోజుకూ మానసికంగా ఎంత తీవ్రంగా బాధపడుతున్నామో ప్రభుత్వానికి అర్థం కావడం లేదని ఆరోపించారు.
ఈ మేరకు హర్యాణాలోని సోనిపట్‌లో రైతులు నిర్వహించిన ఖాప్ పంచాయత్‌లో పాల్గొన్న రెజ్లర్లు స్పష్టం చేశారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగాట్ కూడా ఈ ఖాప్ పంచాయత్‌కు హాజరయ్యారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలకు సంబంధించిన విషయాలను ఖాప్ పంచాయత్ లో రైతులతో పంచుకుంటామని బజ్రంగ్ పూనియా వెల్లడించారు.
కాగా, లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో రాజీకి రావాలని బ్రిజ్ భూషణ్ సన్నిహితులు తమను ఒత్తిడి చేస్తున్నారని స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆరోపించారు. ఒత్తిడి కారణంగానే మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని ఆమె తెలిపారు. అయితే తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆసియా క్రీడల్లో పాల్గొనబోమని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 15లోగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
బుధవారం కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో రెజ్లర్లు.. 5 గంటల పాటు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రెజ్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి.. లిఖిత పూర్వక హామీని వారికి ఇచ్చారు. జూన్ 15 లోగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ లిఖిత పూర్వక హామీలో బ్రిజ్ భూషణ్ అరెస్టును మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం.