ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, ఎక్కడా శాంతి కనిపించదని, భద్రత వినిపించదని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు.
ప్రధానిగా నరేంద్ర మోదీ పాలన 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన ‘జనసంపర్క్ అభియాన్’లో భాగంగా శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో నప్రసంగిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు మోదీ నిరంతరం శ్రమిస్తుంటే.. ఆంధ్రలో మాత్రం దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని విమర్శించారు.
దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే… అది వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని నడ్డా స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలను మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఎండగడుతుందని హెచ్చరించారు.
ల్యాండ్, ఇసుక, మద్యం, విద్య, వైద్యం అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ ఆయన ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తోందంటే జగన్ దిగజారుడు పాలనకు ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలని ప్రశ్నించారు.
అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎక్కడా అభివృద్ధి జాడలేదని, అసలు రాజధానే లేకుండా నాలుగేళ్లుగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను జగన్ సర్కార్ దారి మళ్లించి దోచుకుంటోందని ఆరోపించారు.
తిరుపతి రైల్వే స్టేషన్ను రూ.300 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. రూ.1400 కోట్లతో ఏర్పేడు వద్ద ఐఐటి, ఐజర్ సంస్థలు త్వరలో ప్రారంభానికి నోచుకోనున్నాయని ప్రకటించారు. రాయలసీమ అభివృద్ధిని కూడా వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని చెబుతూ ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే సీమను వృద్ధి బాటలోకి తీసుకెళ్తామని నడ్డా హామీ ఇచ్చారు.
మోదీ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని.. 9ఏళ్లుగా రాజకీయాల దృక్పథాన్నే మార్చేశారని తెలిపారు. ‘కరోనా కాలంలో 80 కోట్ల మందికి ఉచితంగా 5 కేజీల బియ్యం, ఇతర సరుకులు అందజేశాం. 22కోట్ల మంది మహిళలకు రూ.500చొప్పున ప్రతి నెలా ఇచ్చాం’ అని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ పాలనలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇంటి నిర్మాణాలు చేపట్టిందని పేర్కొన్నారు. జనధన్ పథకం ద్వారా 50 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూరుస్తూ వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తోందని తెలిపారు. మొబైల్ ఫోన్ల తయారీ, ఎగుమతుల్లో ఎదిగిందని తెలిపారు. ఆపిల్ ఫోన్ల తయారీ కూడా మనదేశంలో జరుగుతోందని చెప్పారు.