జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. విశాఖలోని రైల్వేస్ గ్రౌండ్లో జరిగిన సభలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం, యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో 20 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు.
కేంద్రం నిధులు ఇస్తుంటే.. జగన్ తన ఫొటో పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెప్పుకుంటున్నారు కానీ.. రైతుల ఆత్మహత్యల విషయంలో జగన్ సిగ్గుపడాలని ధ్వజమెత్తారు.
రైతుల ఆత్మహత్యల విషయంలో.. ఏపీ మూడో స్థానంలో ఉందన్న అమిత్ షా.. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం విద్రోహ శక్తుల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఈ 9 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కోసం మోదీ భారీగా నిధులు ఇచ్చారని వివరించారు.
‘మన్మోహన్ సింగ్ హయాంలో అవినీతి జరిగినా.. చర్యలు తీసుకునే సత్తా లేకపోయింది. కానీ.. బీజేపీ పాలనలో.. పుల్వామా ఘటన జరిగిన 10 రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నాం. సర్జికల్ స్ట్రైక్‌తో పాక్‌కు బుద్ధిచెప్పాం. పదేళ్ల యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మోదీనే గెలిపించాలి. 300 పైకి ఎంపీ స్థానాల్లో మళ్లీ విజయం సాధిస్తాం’ అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
తొమ్మిదేండ్లలో ఏపీ కోసం ప్రధాని మోదీ అనేక పనులు చేశారని చెబుతూ ఇప్పటివరకు ఏపీకి కేంద్ర పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని అమిత్‌షా వెల్లడించారు. ‘‘ఏపీకి రెండు వందే భారత్ రైళ్లను ఇచ్చాం. రూ.450 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం. కడప ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం” అని గుర్తు చేశారు.
“కర్నూలులో కొత్త ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇచ్చాం. కాకినాడ, విశాఖ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలుగా కేంద్రం అభివృద్ధి చేస్తోంది. అనేక కేంద్ర విద్యాసంస్థలు పెడుతున్నాం” అని వివరించారు.