అమెరికా నేతృత్వంలోని కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు చైనాను లక్ష్యంగా చేసుకునేందుకు డీ కపులింగ్ స్థానంలో డీ రిస్కింగ్తో వ్యవహరిస్తున్నాయని, కానీ ఇది కొత్త సీసాలో పాత సారా వంటిదని చైనా వ్యాఖ్యానించింది. ‘డీ రిస్కింగ్’ గురించి మాట్లాడేటపుడు ముందుగా అసలు ముప్పు ఎక్కడ ఉన్నదో గుర్తించాలి, శాంతి, సౌభాగ్యం, మానవాళి సంక్షేమం వీటికి నిజమైన ముప్పు చైనా వ్యతిరేకుల నుండే వస్తోందని చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా వ్యాఖ్యానించింది.
చైనాను లక్ష్యంగా చేసుకునే డీ రిస్కింగ్ గురించి కొందరు మాట్లాడుతున్నారు. చైనా నుంచి ప్రపంచానికి ఎలాంటి ముప్పు లేదు. అసలు ముప్పు అంతా అమెరికా, దాని తైనాతీల నుంచే. వాటి గుత్తాధిపత్య ధోరణి నుంచే. అందుకే పశ్చిమ దేశాల డీ రిస్కింగ్ ఇప్పుడు ప్రపంచానికి అవసరం అని పేర్కొన్నది.
పశ్చిమ దేశాలు తమ అహంకారాన్ని వీడి బహుళ ధ్రువ ప్రపంచం వాస్తవికతను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మంచిదని సిన్హువా పేర్కొంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇరాక్ వంటి దేశాల్లో పశ్చిమ దేశాల దాడులు, దురాక్రమణల వల్ల తలెత్తిన దుష్పరిణామాల గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలని తెలిపింది.
కొన్ని దేశాలు తరచుగా ఇతర దేశాల ముంగిట కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి, వేల మైళ్ళ దూరంలో వున్నప్పటికీ ప్రపంచానికి తీవ్ర ముప్పు కలుగజేస్తున్నాయి. గతేడాది అమెరికా అనేకసార్లు దక్షిణ చైనా సముద్ర జలాల్లో దాడులకు, విన్యాసాలకు దిగడాన్ని ఈ సందర్భంగా సిన్హువా ప్రస్తావించింది.