ఉత్తర ప్రదేశ్ త్వరలోనే భారత్ కు గ్రోత్ ఇంజన్ గా మారబోతోందని ఆ రాష్త్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. కైలాష్ మఠ్ లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన టిఫిన్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ యూపీ అభివృద్ధిలో ఎలా పరుగులు తీస్తోందో కార్యకర్తలకు వివరించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో యూపీ గతంలో ఉన్న బీమారూ స్టేట్ (అనారోగ్య రాష్ట్రం) నుంచి ఇప్పుడు అభివృద్ధి రాష్ట్రంగా పరుగులు తీస్తోందని ఆదిత్యనాథ్ బీజేపీ కార్యకర్తలకు తెలిపారు. ప్రస్తుతం యూపీ అభివృద్ధికీ, భద్రతకు, సుపరిపాలనకు మోడల్ గా మారిందని యోగీ వెల్లడించారు.
త్వరలో భారత్ కే గ్రోత్ ఇంజన్ గా మారబోతోందని యోగీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహా యజ్ఞంలో కలిసి రావాలని ప్రజల్ని కూడా కోరారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో యూపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టిఫిన్ పే చర్చా మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు ఆదిత్యనాథ్ వెల్లడించారు.
బీజేపీ భావజాలాన్ని, విజన్ ను కార్యకర్తల ద్వారా ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఈ టిఫిన్ పే చర్చ ఉపయోగపడుతుందని యోగీ తెలిపారు. తాను కూడా కాశీలో టిఫిన్ పే చర్చ భేటీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. గత తొమ్మిదేళ్లుగా భారత్ ముఖచిత్రం మారుతోందని, 2014కు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా పరిస్ధితి ఉందని యోగీ పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతి రోజూ నిరసనలు, ధర్నాలు జరిగేవని, అలాగే అవినీతి కేసులు కూడా భారీగా నమోదయ్యేవని యోగీ గుర్తుచేశారు. దేశ భద్రతకు అంతర్గతంగా, బయటి నుంచి ముప్పు పొంచి ఉండేదని తెలిపారు. కానీ తొమ్మిదేళ్లుగా ఈ పరిస్ధితుల్లో మార్పు వచ్చిందని చెప్పారు.