మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 18 గంటల సేపు విచారించి బుధవారం తెల్లవారు జామున కస్టడీలో తీసుకుంది. ఆ వెంటనే వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓమందురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.
అక్కడకు చేరుకోగానే సెంథిల్ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని బిగ్గరగా ఏడవడంతో హైడ్రామా చేటుచేసుకుంది. పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు చెబుతుండగా, అధికారికంగా అరెస్టు విషయాన్ని తమకు తెలియజేయలేదని డీఎంకే నేతలు తెలిపారు.
ఆయనపై లంచం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈడీ విచారణకు గతంలో అనుమతి ఇచ్చింది. దీంతో మనీల్యాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ మంత్రి బాలాజీతో పాటూ మరికొంత మంది ఇళ్లలో సోదాలు నిర్వహించింది. సచివాలయంలో ఉన్న మంత్రి బాలాజీ ఆఫీసు రూమ్‌లో కూడా తనిఖీలు జరిగాయి.
మంత్రి సెంథిల్ బాలాజీ భారీ స్థాయిలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆధారాలు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లభించడంతో ఇవాళ ఉదయం ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రిని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించే అవకాశ కనిపిస్తుంది.
మంగళవారం ఈడీ అధికారులు చెన్నైలోని మంత్రి అధికారిక నివాసం, కరూర్‌లోని ఆయన ఇల్లు సోదరుడి ఇంటితో పాటు ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించింది ఈడీ. చివరకు సచివాలయంలోని ఆయన ఛాంబర్లో కూడా తనిఖీలు చేపట్టడం రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కేసులో మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టయ్యాడు. 2013లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో మోసం చేశారని మంత్రిపై ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం నాడు 18 గంటల విచారించిన అనంతరం ఆయన్ని అరెస్టు చేశారు.
అయితే మంత్రి బాలాజీ అరెస్ట్‌ని సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. తమిళనాడులో తమ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక, రాజకీయపరంగా ఎదుర్కొనలేక బీజేపీ కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టు చట్టవిరుద్ధమని డీఎంకే పేర్కొంది.