గృహ వినియోగదారులపై యూనిట్ కు 50 పైసల చొప్పున, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు యూనిట్ కు రూపాయి చొప్పున విద్యుత్ చార్జీలు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దపడుతున్నది. ఇప్పటికే ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ చార్జీల పెంపు భారం సుమారు 1.64 కోట్ల వినియోగదారులపై వేయనున్నది. ఆ మేరకు డిస్కోమ్ లు విద్యుత్ నియంత్రణ కమీషన్ (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమ్పరించాయి.
ఈ ప్రతిపాదనలప్రకారం కోటీ 10 లక్షల మంది గృహ వినియోగదారులపై ప్రతి యూనిట్‌కు 50 పైసల చొప్పున చార్జీలు పెరుగనున్నాయి. 44 లక్షల మంది వాణిజ్య, పారిశ్రామిక ఇండస్ట్రియల్ వినియోగదారులపై యూనిట్‌కు రూ. 1 చొప్పున చార్జీలు పెరుగనున్నాయి.
ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ పబ్లిక్ హియరింగ్ నిర్వహించి అనుమతి ఇవ్వడమే మిగిలి ఉంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమలులోకి వస్తుంది. చివరిసారిగా 2018-–19లో చార్జీలను పెంచారు.
ఈ లోటులో అంతర్గత సర్దుబాట్లు, ప్రభుత్వ మద్దతు కలిపి రూ. 4,097 కోట్ల దాకా అడ్జస్ట్ చేసుకోనున్నాయి. మిగిలిన రూ. 6,831కోట్లు చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. 2019–20, 2020–21, 2021–22కు సంబంధించిన రూ. 27 వేల కోట్ల నష్టాలను ఎట్లా పూడ్చుకుంటారనేది మాత్రం డిస్కంలు వెల్లడించలేదు.
51–100 యూనిట్ల వినియోగానికి ప్రస్తుతం యూనిట్‌కు రూ. 2.60 చార్జీలు వసూలు చేస్తుండగా.. 50 పైసల పెంపుతో రూ. 3.10 వసూలు చేస్తారు. 101–200 యూనిట్ల వాడకానికి ప్రస్తుతం యూనిట్‌కు రూ. 4.30 చొప్పున వసూలు చేస్తుండగా.. 50 పైసల పెంపుతో రూ. 4.80 వసూలు చేయనున్నారు.
51–200 యూనిట్ల కరెంట్వాడే వారు 60 లక్షల మంది ఉన్నారు. వీరంతా సామాన్య, మధ్యతరగతి ప్రజలే. ప్రస్తుతం 150 యూనిట్ల కరెంట్ వాడకానికి రూ. 679 బిల్లు వస్తుండగా.. చార్జీల పెంపు అమలులోకి వస్తే రూ. 754 వరకు బిల్లు రానుంది.