గుజరాత్ కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో బిపర్జోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. అరేబియా సముద్రంలో పది రోజుల క్రితం ప్రారంభమై అత్యంత తీవ్రమైన తుపానుగా మారిన బిపర్జోయ్ తుపాను ఉగ్ర రూపంతో గుజరాత్ తీర ప్రాంతంపై విరుచుకుపడింది.
తీరం దాటిన తర్వాత అతి తీవ్రం నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా కదులుతోంది. ఈ కారణంగా నేడు, రేపు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
తుఫాన్ గాలులతో గుజరాత్లో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బిపర్జోయ్ సైక్లోన్ తీరాన్ని తాకిన అనంతరం గుజరాత్, కరాచీ తీర ప్రాంతాలతో పాటు రాజస్థాన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
గుజరాత్ లోని జఖౌ, మాండ్వీ సహా కచ్, సౌరాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెను గాలులతో విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు బిపర్జోయ్ తుపాను తీరాన్ని తాకడంతో కచ్ తీరం నుంచి పాకిస్తాన్ లోని కరాచీ తీరం వరకూ సముద్రంలోని అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. రాకాసి అలల ధాటికి సముద్రంలోని వంతెన కూడా పేకమేడలా కూలిపోయింది అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
గత పది రోజులుగా ఈ తుపాను గురించి వాతావరణ శాఖ తీవ్రమైన హెచ్చరికలు చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా తుపాను ధాటికి గుజరాత్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రానికి గుజరాత్ తీర ప్రాంతమంతా కుంభవృష్టి కురుస్తోంది.
ఈ తుపాను మూల నాభి (సైక్లోన్ ఐ) దాదాపు 50కిలోమీటర్ల విస్తీర్ణంలో వుందని, గంటకు 13 నుండి 14 కిలోమీటర్ల వేగంతో ముందుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, కాలువలు, నీట మునిగాయి. భావ్‌నగర్ జిల్లాలో తమ మేకలను కాపాడే యత్నంలో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు.
సహాయ చర్యల్లో 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్, 115 రోడ్లు భవనాల శాఖ బృందాలు, 397 విద్యుత్ శాఖ బృందాలు పాల్గొంటున్నాయి. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో విమానయాన సేవలను నిలిపివేశారు. పదుల సంఖ్యలో రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది.
బిపార్జోయ్ మధ్యాహ్నానికి రాజస్థాన్‌ను తాకవచ్చు. దీని తర్వాత రాజస్థాన్, హర్యానా, యూపీలో వాతావరణం మారవచ్చు. బలమైన గాలులు వీచవచ్చు. తుపాను కారణంగా 22 మంది గాయపడ్డారు. తుఫాను గురించి చెప్పిన దానికంటే ఇది చాలా ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది.
గత 25ఏళ్లలో గుజరాత్ తీరాన్ని దాటిన మొదటి తుపాను బిపర్జోయ్. చివరిసారిగా 1998లో అత్యంత తీవ్రమైన తుపాను కచ్ వద్ద తీరానిు దాటింది. కచ్, సౌరాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లో అది భయంకరమైన విధ్వంసం సృష్టించింది. మూడు వేల మంది ప్రాణాలను బలిగొన్నది. మరోవైపు పాకిస్తాన్‌ను కూడా బిపర్జోయ్ వణికిస్తున్నది. ఇప్పటికే సింథ్ ప్రావిన్స్ నుండి 67వేల మందిని తరలించారు.
గుజరాత్ తీర ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల ప్రజలకు ఈ తుపానుతో తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా వేగంగా చర్యలు చేపట్టారు. ఈ జిల్లాల నుంచి గురువారం మధ్యాహ్నం వరకే 94,427 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1,521 పునరావాస కేంద్రాలకు తరలించారు.
వీరిలో ఒక్క కచ్ జిల్లా నుంచే 46,800 మంది ఉన్నారు. దేవభూమి ద్వారక నుంచి 10,749 మంది, జామ్‌నగర్ నుంచి 9,942 మంది, మోర్బీ నుంచి 9,243 మంది, రాజ్‌కోట్ నుంచి 4,864 మంది, జునార్‌గఢ్ నుంచి 4,379 మందిని ఖాళీ చేయించారు.