ప్రధాని నరేంద్ మోదీ జూన్ 20-25 వరకు అమెరికా, ఈజిప్టు దేశాల్లో అధికారిక పర్యటన చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా పర్యటించనున్నారు. ఈ పర్యటన న్యూయార్క్ నుంచి ప్రారంభమవుతుంది.
ఈ పర్యటనలో భాగంగా జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో మోదీ పాల్గొననున్నారు. జూన్ 22న వాషింగ్టన్ డి.సికి వెళ్లనున్నారు. అక్కడ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్ ఆయనకు లాంఛనంగా స్వాగతం పలుకుతారు.
ఆ తర్వాత ఉన్నతస్థాయి సమావేశంలో ఇరువురు నేతలు చర్చలు జరుపుతారు. ఇక అదేరోజు సాయంత్రం మోదీ గౌరవర్థం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంఇఎ) విడుదల చేసిన ఒక ప్రకటన వెల్లడించింది.
ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కెవిన్ మెక్‌కార్తీ, సెనేట్ స్పీకర్ చార్లెస్ షుమెర్‌తో సహా అమెరికా కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్ 22వ తేదీన యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల సభలో ప్రసంగించనున్నారు.
జూన్ 23వ తేదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బిల్న్కెన్లు సంయుక్తంగా మధ్యాహ్నం విందు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో మోదీ ప్రముఖ సిఇఓలు, నిపుణులు, అనేకమంది అధికారులను ఆయన కలవనున్నారు. అలాగే ప్రవాస భారతీయులను కూడా ఆయన కలుస్తారు.
కాగా, జూన్ 24-25 తేదీల్లో ఈజిప్టు అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి ఆహ్వానం మేరకు మోదీ ఈజిప్టుకు వెళ్లనున్నారు. అబ్దెల్ ఫట్టా ఈ ఏడాది జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మోదీ ఈజిప్టుకు వెళ్లడం ఇదే తొలిసారి.