అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి కొందరు ఆగంతకులు ఇంఫాల్‌లోని కొంగ్బా ప్రాంతంలోని రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఇంటిని దగ్ధం చేశారు. ప్రస్తుతం విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాను ఎంతో ప్రేమతో ఇల్లు కట్టుకున్నానని, కానీ, తనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో ‘ అర్థం చేసుకోలేకపోతున్నానని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
`కొందరు నా ఇంటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కూల్చేశారు. ఈ సంగతి తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నా రాష్ట్రంలో సహచర పౌరులు ఇటువంటి పని, కార్యక్రమాలు చేస్తారని నేనెప్పుడూ అంగీకరించలేదు. ఇటువంటి ఘటన జరుగవద్దని నేను దేవుడిని ప్రార్థించాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
`తొలిసారి దాడి చేసినప్పుడు భద్రతా సిబ్బంది రక్షించారు. కానీ రెండోసారి గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో అంతా సాధారణంగా ఉందనుకున్న సమయంలో అకస్మాత్తుగా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేశారు అని నాకు చెప్పారు` అని రాజ్‌కుమార్ రంజన్ సింగ్ తెలిపారు.
దాడి జరిగిన సమయంలో మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ కేరళ పర్యటనలో ఉన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రజలు చుట్టుముట్టారు. దీంతో మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లు ఆ ఇంటి వద్దకు వెళ్లలేకపోయాయి. `వారు నా ఇంటిపై ఎందుకు దాడి చేశారో నాకు తెలియదు. అందుకు సహేతుకమైన కారణమే లేదు’ అని చెప్పారు.
`నేను రాష్ట్రంలో సాధారణ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు నా సీనియర్ మంత్రులు, సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నా, శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించా. అయినా ఈ అవాంఛనీయ ఘటన జరిగింది. ఒకవేళ నా కొడుకులు, కూతుళ్లు, కుటుంబం అక్కడే ఉండి ఉంటే, పెట్రోల్ పోసి తగలబెట్టే వారు. నా పైనా దాడి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది` అని ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.
`కేంద్రం పలు రక్షణలు కల్పించినా, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం శాంతిని కాపాడలేకపోయింది. మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. వ్యవస్థ ఎందుకు విఫలం అయిందో నాకు తెలియదు` అని రాజ్ కుమార్ రంజన్ సింగ్ తెలిపారు.
మే 3 నుండి కుకీ, మెయిటీ కమ్యూనిటీలకు చెందిన 120 మందికి పైగా మరణించారు. 350మందికిపైగా గాయపడ్డారు. 50,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. బుధవారం ఇంపాల్ వెస్ట్ లోని పరిశ్రమల శాఖ మంత్రి నెమ్చా కిపిజెన్ నివాసంపై కూడా నిరసనకారులు దాడి చేశారు.