ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న హింసను, దాడులను నియంత్రించేందుకు దిశ యాప్ ద్వారా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మహిళలపై హింస గణనీయంగా పెరిగింది. పోస్కో వంటి కఠిన చట్టాలున్నా బాలికలపై లైంగిక హింస ఏమాత్రం తగ్గలేదు.
2021వ సంవత్సరానికి రాష్ట్ర పోలీస్‌శాఖ రూపొందించిన క్రైమ్ నివేదిక ప్రకారం గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో మహిళలపై హింస 21 శాతం పెరిగింది. 2020లో రాష్ట్ర వ్యాప్తంగా 14,603 కేసులు నమోదైతే 2021లో 17,736 నమోదయ్యాయి. 2019లో 15,665, 2018లో 14,338, 2017లో 14,813 కేసులు నమోదయ్యాయి.
ప్రతి ఏడాది మహిళలపై హింస పెరుగుతుండటం గమనార్హం. ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌శాఖ నిర్వహించే స్పందన కార్యక్రమానికి మొత్తం 1,63,033 అర్జీలు వస్తే అందులో 52 శాతం తమపై జరుగుతున్న హింసను అరికట్టాలంటూ మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఉంటున్నాయి.
ఇక మహిళలకు రక్షణ కోసం ప్రభుత్వం రూపొందిన దిశ యాప్ దేశంలోనే అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్‌గా రికార్డు సృష్టించింది. వారిలో నెలకొన్న అభద్రతకు దీనిని నిదర్శనంగా భావించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తం 97,41,943 మొబైల్స్‌లో దిశయాప్ డౌన్లోడ్ అయ్యింది. దీని ద్వారా 4,51,905 వినతులు అందగా 12,624 వినతులపై విచారణ జరిపారు ఇందులో 7,621 నేరపూరితమయినవిగా గుర్తించగా 939 ఎఫ్ఐఆర్లు మాత్రమే నమోదు చేశారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తాడేపల్లి సమీపంలో కృష్ణానదిలో సీతానగరం ఘాట్ వద్ద ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగిన కేసులో పోలీస్‌లు ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చూపారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు మైనర్బాలికలు, ప్రకాశం జిల్లాలో ఒక మహిళపై జరిగిన అఘాయిత్యాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.