మణిపూర్లో హింస కొనసాగుతున్నది. కాంటో సంబల్, చింగ్మాంగ్ గ్రామాల్లో ఆదివారం భారీగా కాల్పులు జరిగినట్లు సమాచారం. అదే సమయంలో కంటో సంబల్లోని ఐదు ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. అలాగే పలు ప్రాంతాల్లో నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి.
ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ గాయపడ్డాడు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక సాయుధ దుండగులు కాంటో సంబల్ నుంచి చింగ్మాంగ్ గ్రామం వైపు అకారణంగా కాల్పులు జరిపారని సైన్యం పేర్కొంది. సామాన్యుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎదురు కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో ఓ జవాన్ గాయపడ్డాడని, అతన్ని లిమాఖోంగ్ సైనిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ప్రస్తుతం జవాన్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా స్థానికుడు ఒకరు మాట్లాడుతూ ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత అనుమానిత కుకీ ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాంటో సంబల్పై కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు.
అంతటితో ఆగకుండా ఉగ్రమూకలు ఐదు ఇళ్లకు కూడా నిప్పుపెట్టారని చెప్పాడు. హింసాత్మక ఘటన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించినట్లు బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అధికారి అముతోయ్ పేర్కొన్నారు.
నెల కిందట మణిపూర్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. మెయిటీ, కుకీ వర్గాల ప్రజల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో పాటు 11 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిషేధించింది.