తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో ఒకే ఒక్కసారి బీజేపీకి అధికారం కట్టబెడితే, అవినీతి రహిత పాలన అందిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాంబరంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలన ప్రజలకు వివరించేలా మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాభివృద్ధి తక్కువగా జరిగిందని చెప్పారు.
కానీ, ప్రధాని మోదీ అధికారం చేపట్టి తర్వాత దేశాభివృద్ధి వేగవంతమైందని చెబుతూ కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ (రాజదండం) ఏర్పాటు తమిళనాడుకు సరికొత్త అధ్యాయం సృష్టించిందని తెలిపారు. అందువల్ల సెంగోల్ ప్రాముఖ్యత ప్రపంచానికే తెలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రానికే వన్నె తెచ్చిన సెంగోల్‌ను పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని పిలుపునిచ్చారు.
కరోనా కాలంలోనే ఆర్థికాభివృద్ధి మందగించకుండా కాపాడిన వ్యక్తి ప్రధాని మోదీ అని చెప్పారు. తమిళం ప్రపంచంలోనే ప్రాచీన భాష అని, తిరువళ్లువర్ సహా పలువురు పండితులను అందించిన భూమి తమిళనాడు అని కొనియాడారు. దేశంలోని అన్ని భాషలకు తమిళం తల్లిలాంటిదని తెలిపారు.
2047 నాటికి ప్రపంచంలోనే అతి శక్తివంత దేశంగా భారత్ ఆవిర్భవించనుందని పేర్కొంటూ దేశం ప్రతి వ్యక్తి ఆదాయం పెరుగుతోందని, ప్రపంచమే భారత్ బాటలో పయనిస్తోందని భరోసా వ్యక్తం చేయసారు. ప్రధాని మోదీ తిరుక్కురల్‌ను మార్గదర్శిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ ఉత్పత్తి, వినియోగంలో చైనాను మించిన దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.
రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. డీఎంకే పాలనలో అవినీతి భారీస్థాయులో జరుగుతోందని చెబుతూ ప్రజలు సంక్షేమమే బీజేపీ అజెండా కాగా, మిగిలిన పార్టీలకు అధికారమే అజెండాగా ఉందని విమర్శించారు.
రక్షణ పరికరాలు దిగుమతి చేసుకొనే దేశంగా భారత్ ఉండేదని, ప్రస్తుతం రక్షణ పరికరాలు ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్న దేశాల జాబితాలో తొలి 25 స్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని చెప్పా రు. సెంథిల్ బాలాజి వ్యవహారంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజకీయ అవినీతి కారణంగా సెంథిల్ బాలాజిని అరెస్ట్ చేశారని సీఎం ఆరోపిస్తున్నారని, కానీ అవినీతి కేసులో అరెస్టయ్యారని రాష్ట్ర ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు తెలిపిన తమ పార్టీకి చెందిన ఎస్జీ సూర్యను ఎందుకు అరెస్ట్ చేశారో సీఎం స్టాలిన్‌ను ప్రశ్నిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమిలో ఉన్నామని, కూటమి ధర్మాన్ని పాటించి అన్నాడీఎంకేకు తగిన మర్యాద ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పేద ప్రజల సంక్షేమ కోసం శ్రమించిన జయలలిత అంటే బీజేపీకి ప్రత్యేక అభిమానం ఉందని చెబుతూ బీజేపీలో అవినీతి పాల్పడే వారు జైలుకు వెళ్లక తప్పదని కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ స్పష్టం చేశారు.