బీజేపీ-జనసేన పొత్తు ప్రసక్తి లేదని, తెలంగాణలో బీజేపీ సింహం లెక్క సింగిల్ గానే పోటీ చేసి, అధికారం కైవసం చేసుకుంటుందని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భరోసా వ్యక్తం చేశారు. గురువారం మహా జనసంపర్క్ అభియాన్”లో భాగంగా బండి సంజయ్ కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వ హించారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్ లోకేనని తేల్చి చెప్పారు. ఇటీవల కొందరు నేతలు కేసీఆర్ ను ఓడించడం కోసం అంటూ కాంగ్రెస్ లో చేరడాన్ని ప్రశవిస్తూ కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని హెచ్చరించారు.
ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇయాళ పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ విమర్శలు హుందాగా ఉండాలే… నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సాయంతో ఎంపీగా గెలిచానంటే జనం నవ్వుకుంటున్నారని కొట్టిపారేసారు.
అదే నిజమైతే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా ఎట్లా గెలిచారు? అని ప్రశ్నించారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుండి రాష్ట్ర అధ్యక్షుడి వరకు తాము నివాసం ఉండే పోలింగ్ బూత్ లకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతుండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మోదీగారి 9 ఏళ్ల పాలనను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. “ఇంటింటికీ బీజేపీ” కార్యక్రమం ద్వారా ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణలో 90 లక్షలకుపైగా కుటుంబాలుంటే అందులో మూడో వంతుకుపైగా కుటుంబాలను బీజేపీ కార్యకర్తల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు కలిసేలా కార్యాచరణ రూపొందించామని వివరించారు.