నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు మాత్రం రాష్ట్రానివని, ఏపీలో ఇదో విచిత్రమైన పరిస్థితి ఉందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఎద్దేవా చేశారు.
వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన విజయవాడ మొఘల్రాజపురం సిద్ధార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో మంగళవారం ”ప్రజాగ్రహసభ” లో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ రూ. 1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారని విమర్శించారు.
అవి జగనన్న కాలనీలు కాదు.. మోదీ కాలనీలని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు. వైద్యారోగ్య నిధులను కూడా కేంద్రమే ఇస్తున్నా.. జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇటీవల విడుదలైన పుష్ప సినిమాను ప్రస్తావిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ పై పుష్ప సినిమాలో చూపించారని ఏపీలో అలాంటి పరిస్థితే ఉందని పెక్రోన్నారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోన్నా సిట్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఎత్తేసినదని ఆయన మండిపడ్డారు.
వృద్ధాప్య ఫించన్లను నేరుగా వేయకుండా వాలంటీర్ల ద్వారా ఇస్తున్నారని.. కానీ, కేంద్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు డీబీటీల ద్వారా నగదును నేరుగా బదిలీ చేస్తున్నదని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
బెయిల్ పై ఉన్న నేతలు జైలుకే
రాష్ట్రంలో చాలా మంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, వారు ఎప్పుడైనా జైలుకెళ్లవచ్చని అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ పై చురకలు అంటించారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ పోలవరానికి రికార్డు టైంలో ఒక నెలలోనే పర్యావరణ అనుమతులు తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చానని గుర్తు చేశారు.
తాను నెలలో అనుమతులిస్తే.. ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని కోసం అటవీ భూములకు అనుమతులిచ్చామని, కానీ, దురదృష్టకరం.. రాజధాని విషయంలో రెండూ పార్టీలు పోట్లాడుకుంటున్నాయని మండిపడ్డారు. వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీల ప్రభుత్వాలు మూడూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని అన్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఛార్‌ధామ్ అభివృద్ది చేస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నదని, కాశీని అభివృద్ధి చేస్తున్నదని, అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నదని మాజీ కేంద్ర మంత్రి గుర్తు చేసారు. కానీ, ఏపీలో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని, రథాలు తగులబెడుతున్నారని గుర్తు చేశారు. దేశంలో నిర్మాణత్మకంగా వెళ్తుంటే.. ఏపీలో విధ్వంసం జరుగుతోందని ప్రకాశ్ జవదేకర్ ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
టిడిపి, వైసిపి, టిఆర్ఎస్ కుటుంబ పార్టీలే
తెలుగు రాష్ట్రాలలో ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీలు టిడిపి, వైసిపి, టిఆర్ఎస్ కుటుంబ పార్టీలే అని, పైగా అవి అవినీతి పార్టీలను జవదేకర్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలకు కుటుంబ ప్రయోజనాలు, అవినీతి తప్ప.. అభివృద్ధి పట్టదని స్పష్టం చేస్తూ టీడీపీ, వైసీపీతోపాటు తెలంగాణలోని టీఆర్ఎస్ తెలుగు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.
రాష్ట్రానికి మేలు చేసేది బీజేపీ మాత్రమేనని, ప్రత్యామ్నాయంగా తమను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు దీవిస్తే ఏపీలో బీజేపీ పెద్ద పార్టీ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక, ఏపీ అంటే తనకు ప్రేమ అని చెబుతూ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించానని తెలిపారు. అంతేగాక, తనకు ఆంధ్రా భోజనం అంటే ఇష్టమని పేర్కొన్నారు.
‘మోదీని విమర్శించడం వల్లే 2019లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే.. టీడీపీ కనుమరుగైనట్లే..’ అని జావడేకర్ స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ఇప్పటికైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని కోరుతూ మోదీ నేతృత్వంలోని బీజేపీనే ఏపీ ప్రగతికి సరైన పార్టీ అని స్పష్టం చేశారు. అరాచక పాలనకు చరమగీతం పాడి సుపరిపాలన కోసం బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్నారని, కానీ, ఇప్పుడు మద్యం అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులను, టీచర్లను రిక్రూట్ చేస్తామన్నారని, కానీ గాలికొదిలేశారని విమర్శించారు. రైతుల పంటల బీమా ప్రిమీయం కడతానన్న జగన్.. మాట తప్పారని పెక్రోన్నారు.