కుటుంబ పాలన కావాలంటే ఈ పార్టీలకు ఓటు వేయాలని, అభివృద్ధి కావాలంటే బిజెపికి ఓటు వేయాలని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపునిచ్చారు. బిహార్‌లో లాలు కుటుంబ పాలన, యూపిలో ములాయం సింగ్ కుటుంబ పాలన, కేంద్రంలో సోనియా గాంధీ కుటుంబ పాలన, తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన కావాలంటే ఈ పార్టీలకు ఓటు వేయాలని చెప్పారు.
ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన నిర్వహించిన నవ సంకల్ప సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటూ పాట్నాలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమి కట్టలేదని అది కేవలం ఒక ఫోటో సెషన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.
గతంలో ప్రధానులు విదేశీ పర్యటనకు వెళ్తే నిత్యం టెర్రరిజం, కశ్మీర్, పాకిస్థాన్ సమస్యలు మాత్రమే ముందుకు వచ్చేవని, కానీ నేడు బిజెపి హయాంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో విదేశాలకు వెళ్తే అభివృద్ధే మంత్రంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనా కష్టకాలం, యుక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా భాతర దేశంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ముందుకు సాగామని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి మోడి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు పరుస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయిలో ఆధునీకరించడం జరిగిందని గుర్తు చేసారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ క్యారిడార్, మెగా టెక్స్టైల్ పార్కులు అందించిన ఘనత మోడి సర్కార్‌దేనని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం బిజెపికి ఓటు వేయాలని నడ్డా కోరారు. అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు వెళ్లిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆయా దేశాలలో ఘన స్వాగతం పలికారని చెబుతూ మోడి హయాంలో పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు.
పేదలకు రెండు పూటలా తిండి అందించాలన్న లక్ష్యంతో 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం అందిస్తున్నామని చెప్పారు. పక్కా ఇళ్లు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా 31 లక్షల మరుగుదొడ్లను తెలంగాణలో నిర్మించడం జరిగిందని అంటూ బడుగు బలహీన వర్గాలు రైతుల కోసం పాటు పడే ప్రభుత్వం మోడి ప్రభుత్వమని స్పష్టం చేశారు.
9 ఏళ్లలో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని, ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత మోడిదని వివరించారు. ప్రపంచం నేడు మోడీని గ్లోబల్ లీడర్‌గా, హీరోగా భావిస్తుందని కొనియాడారు.