‘వైఎస్సార్ లా నేస్తం’ కార్యక్రమాన్ని సిఎం వైఎస్.జగన్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టయిఫండ్ చొప్పున 2023-24 సంవత్సరానికి మొదటి విడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా లా నేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు. 2677 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ములకు రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమచేస్తున్నామని పేర్కొన్నారు.
లా కోర్సు పూర్తి చేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని, ఈ పరిస్థితుల్లో వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5 వేలు, ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.
దీనివల్ల వాళ్లు నిలదొక్కుకుంటారని చెబుతూ ఇప్పటివరకు 5,781 మందికి మేలు చేశామని తెలిపారు. మొత్తంగా రూ.41.52 కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చామని పేర్కొంటూ ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు.
అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును పెట్టామని చెబుతూ మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చునని, ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు ఇప్పటికే సహాయం చేశామని వివరించారు. న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచిందని సిఎం చెప్పారు.
ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను ఒక్కటే కోరుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.