2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లాగైనా అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి మొదటగా రిజర్వేడ్ సీట్లపై దృష్టి సారించింది. 19 ఎస్సి, 12 ఎస్టీ రిజెర్వేడ్ సీట్లు అన్నింటిని గెల్చుకోవడం ద్వారా, అధికారంలోకి రావడానికి బలమైన పునాది ఏర్పర్చుకోవాలని భావిస్తున్నది.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మార్గనిర్ధేశంతో రూపొందిస్తున్న వ్యూహాలతో భాగంగా ఆయా వర్గాల ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లపాటు ఆ నియోజకవర్గాల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి ఒక రోడ్‌మ్యాప్‌ను, ఫార్మూలాను ఖరారు చేయనుంది.
ఎస్సీ స్థానాలపై పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం నిర్వహించిన అంతర్గత వర్క్‌షాప్‌లో ఈ నియోజకవర్గాలలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్వహించారు. 2009లో 10 ఎస్సి సీట్లు గెల్చుకొని కాంగ్రెస్, 2014లో 13, 2018లో 15 ఎస్సి సీట్లు గెల్చుకొని టి ఆర్ ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయని ఈ సందర్భంగా సంజయ్ గుర్తు చేశారు. కనీసం 10 ఎస్సి సీట్లు గెల్చుకోగలిగితే తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన భరోసా వ్యక్తం చేసారు.
ఈ సీట్లలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలు, ఆయా స్థానాల్లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానిపై లోతైన అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాలతోపాటు మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు దోహదపడే అంశాలను పరిశీలిస్తోంది.
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలవారీగా విస్తృత కసరత్తు ద్వారా బలమైన అభ్యర్థులను గుర్తించి ముందు నుంచే వారిని పోటీకి సిద్ధం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఆయా స్థానాలకు సంబంధించి పార్టీలో బలమైన అభ్యర్థులు లేని చోట్ల, ఆయా సీట్లలో ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి, ఏ పార్టీ వారిని చేర్చుకొని సీటిస్తే పక్కాగా విజయం సాధించవచ్చు వంటి అంశాలపై కసరత్తు చేపడుతోంది.
ఒకొక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమిస్తున్నారు. వారంతా జనవరి 5 నుండి 25 వరకు తమ తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటనలు జరుపుతారు. పాదయాత్రలు, స్థానిక సమస్యలపై ఆందోళనల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు.
దళితులకు ఇచ్చిన మూడెకరాల చొప్పున భూకేటాయింపు హామీ, దళితబంధు కింద రూ. 10 లక్షలు ఖాతాల్లో డిపాజిట్ అంశాలను ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల ద్వారా ఎండగట్టాలని నిర్ణయించింది. ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు పెంపుదల, ఇతర హామీల అమలుపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసేలా నిరసనలు చేపట్టాలని భావిస్తోంది.