తన భర్త బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటెల జామున సంచలన ఆరోపణలు చేశారు. ఈటలను హత్య చేసేందుకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆమె తెలిపారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నట్లు తమకు తెలిసిందని జమున చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రోద్భలంతోనే కౌశిక్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని పేర్కొంటూ తమ కుటుంభంలో ఎవ్వరికీ హాని కలిగినా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. కేసీఆర్ తమను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని, కానీ తాము వాటిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
కేసీఆర్ లాంటి సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా? అని జమున ప్రశ్నించారు. రూ.20 కోట్లు కాదని, ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ది చెప్తారని విమర్శించారు. శాడిస్టులను పక్కన పెట్టుకుని కేసీఆర్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డిని కేసీఆర్ హూజారాబాద్ ప్రజలపైకి ఉసిగొల్పారని అంటూ కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆమె విమర్సించారు.
హుజూరాబాద్‌లో అమరవీరుల స్థూపాన్ని కౌశిక్ రెడ్డి కూలగొట్టించారని చెబుతూ అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పిచ్చికుక్కలా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని మండిపడుతూ అమరవీరుల స్థూపాన్ని పడగొట్టించిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అమరవీరులను కేసీఆర్ కించపరుస్తున్నారని ఆమె ధ్వజయంట్టారు.
కాగా, బీజేపీలో ఈటల రాజేందర్ సంతృప్తిగా ఉన్నారని జమున స్పష్టం చేశారు. ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు.