కేసీఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి, గాంధీ కుటుంబానికి మేలు కలగాలనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయండి…మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీ లిక్కర్ స్కామ్ ను ప్రధాని ప్రస్తావించారు. భోపాల్లో నిర్వహించిన ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటూ కుటుంబ పార్టీలపై విమర్శలు చేశారు.
ఇటీవల జరిగిన విపక్షాల భేటీని ప్రధాని ప్రస్తావిస్తూ అవినీతిపై చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని భావించి ప్రతిపక్షాలన్నీ ఒకచోటకు చేరుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయని ధ్వజమెత్తారు. బీజేపీ మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదని హామీ ఇస్తామని తేల్చి చెప్పారు.
తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వమన్న ప్రధాని మోదీ… నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకన్నా దేశమే పెద్దదని ప్రధాని మోదీ పేర్కొ్న్నారు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదని బీజేపీ నిర్ణయించుకుందని తెలిపారు.
ఉమ్మడి పౌరస్మృతి పేరిట కొన్ని పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని, అయితే వేర్వేరు చట్టాలతో దేశాన్ని ఎలా నడపాలని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు నిబంధనలు వర్తించని స్పష్టం చేశారు. రాజ్యాంగం కూడా సమాన హక్కుల గురించి చెబుతోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శలు చేశారు.
విపక్ష పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు ఉచిత హామీ ఇస్తాయని ప్రధాని ఎద్దేవా చేశారు. బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ చెప్పారు. ప్రతిపక్ష భేటీలో పాల్గొన్న నాయకులందరూ కలిసి రూ.20 లక్షల కోట్ల స్కామ్ లకు పాల్పడినట్లు మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపణలు చేశారు.